ఎదులాపురం, మార్చి 13 : ఆదిలాబాద్ జిల్లాలో వంట గ్యాస్ కొరత లేదని, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ రాజర్షి షా హెచ్చరించారు. శుక్రవారం సాయంత్రం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని విమల్ గ్యాస్ ఏజెన్సీని ఆయన తనిఖీ చేశారు. సిలిండర్ల స్టాక్ వివరాలు, ఆన్లైన్ బుకింగ్, ఇతర అంశాలపై సమీక్షించి నిర్వాహకులకు పలు ఆదేశాలు జారీ చేశారు. సిలిండర్ల కొరతపై సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని, ఆన్లైన్లో బుక్ చేసుకున్న వెంటనే వినియోగదారులకు సిలిండర్లను అందించేలా ఏజెన్సీ నిర్వాహకులను ఆదేశించినట్లు తెలిపారు. బ్లాక్ మారెట్లో సిలిండర్లను విక్రయిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. పౌరసరఫరా, రెవెన్యూ పోలీస్ శాఖలతో కమిటీని ఏర్పాటు చేసి గ్యాస్ కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఏవైనా ఇబ్బందులుంటే 1800-425-1939 టోల్ ఫ్రీ నంబర్లో సంప్రదించవచ్చని సూచించారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ రాజేశ్వర్, డీఎస్వో నందిని, తహసీల్దార్ శ్రీనివాస్, ఎన్ఫోర్స్మెంట్ డీటీ మహేశ్, ఏజెన్సీ ప్రతినిధులు, ఇతర అధికారులు, వినియోగదారులు పాల్గొన్నారు.