నిజామాబాద్, మార్చి 13, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) ;గ్రామ పంచాయతీలకు అభివృద్ధి నిధుల రాక మొదలవ్వలేదు. పంచాయతీల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరి నెలలు గడుస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అభివృద్ధి నిధులు చిల్లి గవ్వ విడుదల కాలేదు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల మంజూరు చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులు మినహా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం అందడం లేదు. రాష్ట్రంలో ప్రతి గ్రామ పంచాయతీకి ప్రత్యేక అభివృద్ధి నిధులు(ఎస్డీఎఫ్) అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ కూడా నెరవేరడం లేదు. రాష్ట్రంలో పంచాయతీలకు కొత్తగా పాలకవర్గాలు ఏర్పాటైన నేపథ్యంలో చిన్న గ్రామ పంచాయతీలకు రూ.5లక్షలు, మేజర్ గ్రామ పంచాయతీలకు రూ.10లక్షలు చొప్పున ఎస్డీఎఫ్ నిధులు అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి గతేడాది డిసెంబర్ 24న కొడంగల్లో జరిగిన సభలో ప్రకటించారు. సీఎం ప్రకటించి రెండు నెలలు దాటినప్పటికీ ఎస్డీఎఫ్ నిధులు మాత్రం పంచాయతీలకు చేరలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మేజర్ జీపీలకు రూ.10లక్షలు, చిన్న జీపీలకు రూ.5లక్షలు చొప్పున మంజూరు చేస్తే నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు సుమారుగా రూ.60నుంచి రూ.70కోట్లు నిధులు వచ్చే ఆస్కారం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన వాగ్ధానం అమలుకు నోచుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
చిల్లి గవ్వ ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం
గ్రామ పంచాయతీలకు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు చిల్లి గవ్వ రాలేదు. కొత్తగా ఎన్నికైన సర్పంచ్లు, గ్రామ పంచాయతీ పాలకవర్గాలు నిరుత్సాహంతో కొట్టుమిట్టాడుతున్నాయి. కొత్తగా బాధ్యతలు చేపట్టిన జీపీ పాలకవర్గాలకు పని చేయాలనే ఉత్సాహం నీరు గారుతోంది. అభివృద్ధి పనులు చేపట్టాలనే ఆసక్తితో ఉన్న సర్పంచ్లకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి తోడ్పాటు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతానికి జీపీలకు ఎలాంటి నిధులు రాకపోవడంతో కొన్ని చోట్ల ఆర్థికంగా ఉన్న సర్పంచ్లు సొంత ఖర్చులతో చిన్నపాటి పనులను చేయిస్తున్నారు. అదే విధంగా మేజర్ గ్రామ పంచాయతీల సర్పంచ్లు పంచాయతీ నిధుల నుంచి నిర్వహాణ పనులను చేపడుతున్నారు. పన్నులు వసూలు కాని జీపీలు, ఆర్థికంగా లేని సర్పంచ్లు ఉన్న జీపీల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
గ్రామంలో అభివృద్ధి పనులు చేద్దామనే ఆలోచన ఉన్నప్పటికీ చేతిలో నిధులు లేకపోవడంతో నూతన సర్పంచ్ల్లో నైరాశ్యంలో ఉండి పోవాల్సినంత దౌర్భాగ్యం ఏర్పడింది. అభివృద్ధి నిధులు వస్తే గ్రామాల్లో పారిశుద్ధ్యం, వీధి లైట్లు, తాగునీరు తదితర చిన్నపాటి పనులకు ఉపయోగపడతాయని సర్పంచ్లు భావిస్తున్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులను వీధి దీపాలు, ట్రాక్టర్ల నిర్వాహణ, ఇంధన వినియోగం, వరదల సమయంలో దెబ్బతిన్న పనులకు ప్రాధాన్య క్రమంలో వెచ్చించాలని అధికారులు సూచిస్తున్నారు. అందులో నుంచి 5-10శాతం డబ్బును ఈ-పంచాయతీ ఖాతాల్లో జమ చేస్తున్నారు. వీటితో ఈ-పంచాయతీ ఆపరేటర్ల వేతనాలు, స్టేషనరీకి ఖర్చు చేయనున్నట్లుగా అధికారులు పేర్కొంటున్నారు. తమ హయాంలో చేపట్టిన పనుల బిల్లులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయని తాజా మాజీ సర్పంచ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గ్రామ పంచాయతీలు డీలా…
రాష్ట్రంలో సకాలంలో పంచాయతీలకు ఎన్నికలు జరగకపోవడంతో రెండేళ్లుగా కేంద్ర ప్రభుత్వం అందించే 15వ ఆర్థిక సంఘం నిధులు నిలిచి పోయాయి. మార్చి 31తో 15వ ఆర్థిక సంఘం కాల పరిమితి ముగియనుంది. ఈ లోగా పంచాయతీలకు ఎన్నికలు జరగని పక్షంలో రాష్ర్టానికి రావాల్సిన రూ.3వేల కోట్లు వెనక్కి వెళ్లే ప్రమాదం ఏర్పడింది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి హుటాహుటిన గ్రామ పంచాయతీల ఎన్నికల నిర్వాహణకు ముందుకొచ్చారు. రాష్ట్రంలో డిసెంబర్ నెలలో మూడు విడతలుగా గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. డిసెంబర్ 22న కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. దీంతో 15వ ఆర్థిక సంఘం నిధులను కేంద్రం విడుదల చేస్తూ వస్తోంది. గ్రామ పంచాయతీలకు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అందించే ఆర్థిక సంఘం నిధులే దిక్కుగా మారాయి. ఇటీవల కేంద్ర ఆర్థిక సంఘం నిధులు ఆయా గ్రామ పంచాయతీల ఖాతాల్లో జమ అవుతున్నప్పటికీ పేరుకు పోయిన సమస్యలు, పెండింగ్ బిల్లులు చెల్లింపులకే ఖర్చవుతున్నాయి. కొత్తగా ఏమైనా పనులు షురూ చేద్దామని భావించిన గ్రామ పంచాయతీ పాలకవర్గాలకు నిరాశ ఎదురవుతోంది. ఫలితంగా నిధుల లేమితో గ్రామాలు డీలా పడుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో 545, కామారెడ్డి జిల్లాలో 532 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఖజానాలో డబ్బులు లేకపోవడంతో చిన్నపాటి పనులు సైతం చేపట్టడానికి పాలకవర్గాలు కొట్టుమిట్టాడుతున్నాయి.