హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ) : ప్రయాణికుల అభ్యర్థన మేరకు హైదరాబాద్ – మంగళూరు మధ్య నడుస్తున్న ప్రత్యేక రైలు సేవలను పొడిగిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ఆదివారం ప్రకటించింది. సాధారణంగా వేసవి సెలవుల రద్దీ నేపథ్యంలో రైల్వే శాఖ దేశంలోని పలు ప్రాంతాల మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నది.
ఈసారి హైదరాబాద్ నుంచి కర్ణాటకలోని మంగళూరు మధ్య నడుస్తున్న ప్రత్యేక రైలుకు ప్రయాణికుల నుంచి మంచి స్పందన రావడంతో ఈ రూట్లో ఇంకొంతకాలం సేవలను కొనసాగించాలని రైల్వే శాఖ నిర్ణయం తీసుకున్నది. ప్రత్యేక రైలు రాకపోకలను మరో ఐదు ట్రిప్పులు పొడిగిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది.