Missing Meghana | టాలీవుడ్ పరిశ్రమలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న వైవిధ్యభరితమైన చిత్రం “మిస్సింగ్ మేఘన”. ఫస్ట్ కాపి మూవీస్ మరియు కేడి అండ్ కో బ్యానర్లపై పంచుమర్తి నరేష్ బాబు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి వాచస్పతి దర్శకత్వం వహించారు. రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 18న గ్రాండ్ గా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ తాజాగా ప్రీ రిలీజ్ వేడుకను అత్యంత ఘనంగా నిర్వహించింది. ప్రముఖ నిర్మాత దామోదర్ ప్రసాద్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ వేడుకలో సినిమాకు సంబంధించిన విశేషాలను చిత్ర బృందం ఎంతో ఉత్సాహంగా పంచుకుంది. ముందుగా తంత్ర చిత్ర దర్శకుడు శ్రీనివాస్ గోపిశెట్టి మాట్లాడుతూ, తన స్నేహితుడైన వాసు (వాచస్పతి) దర్శకత్వంలో నరేష్ బాబు నిర్మాతగా వస్తున్న ఈ చిత్రం ఘనవిజయం సాధించి అందరికీ మంచి పేరు తెచ్చిపెట్టాలని ఆకాంక్షించారు. నటుడు ధనుష్ రఘుముద్రి మాట్లాడుతూ, ఫస్ట్ కాపీస్ బ్యానరే తనకు గుర్తింపునిచ్చిందని, అదే బ్యానర్ నుంచి వస్తున్న ఈ సినిమాను ప్రేక్షకులందరూ సెప్టెంబర్ 18న థియేటర్లలో తిలకించి విజయవంతం చేయాలని కోరారు.
సింగర్ సాకేత్ మాట్లాడుతూ, ఈ చిత్రంలోని పాటలు మరియు విజువల్స్ అద్భుతంగా వచ్చాయని, సినిమాకు సపోర్ట్ చేస్తున్న పెద్దలందరికీ ధన్యవాదాలు తెలిపారు. ప్రముఖ నటుడు గోపరాజు రమణ మాట్లాడుతూ, దర్శకుడు వాచస్పతి ఒక మంచి కుటుంబ కథను అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే జోనర్స్ తో ఎంతో ఆసక్తికరమైన మలుపులతో తెరకెక్కించారని ప్రశంసించారు. సంగీత దర్శకుడు ఆర్.ఆర్. ధృవన్ మాట్లాడుతూ, ఈ చిత్రానికి పనిచేయడం ఒక చక్కని అనుభూతినిచ్చిందని, బెక్కం వేణుగోపాల్ సహకారంతో మంచి పాటలు అందించడం జరిగిందని తెలిపారు.
ప్రముఖ నిర్మాత బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ, ఈ సినిమాను తాను చూశానని, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండటంతో తాను కూడా సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చానని చెప్పారు. అంకిత్, రామ్ కార్తీక్ ల నటన ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని ఆయన కొనియాడారు. దర్శకుడు వాచస్పతి మాట్లాడుతూ, కథే ఈ చిత్ర విజలానికి ప్రధాన బలమని, టీమ్ అందరి సపోర్ట్ తో ఈ సినిమాను అద్భుతమైన ప్రమోషన్స్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకువెళ్తున్నామని తెలిపారు.
హీరో రామ్ కార్తీక్ మాట్లాడుతూ, తన తొలి చిత్రం నుంచి తనకు మద్దతుగా నిలుస్తున్న అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ చిత్రంలో సంగీతం, పాటలు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తాయని, బెక్కం వేణుగోపాల్ మరియు ముఖ్య అతిథి దామోదర్ ప్రసాద్ అందించిన ప్రోత్సాహం ఎప్పటికీ మరువలేనని పేర్కొన్నారు. నటుడు అంకిత్ కొయ్య మాట్లాడుతూ, సుదీర్ఘ విరామం తర్వాత మీడియా ముందుకు రావడం సంతోషంగా ఉందని, మీడియా సహాయసహకారాలతో ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు.
ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ నిర్మాత దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ, హీరో రామ్ కార్తీక్ పై ఉన్న నమ్మకంతోనే తాను ఈ వేడుకకు వచ్చానని తెలిపారు. ఒక నిర్మాతకు సినిమా విడుదల వరకు కాన్ఫిడెన్స్ చాలా అవసరమని, సినిమా అంటే కేవలం డబ్బు మాత్రమే కాదని కొందరి జీవితాలని ఆయన అన్నారు. చిన్న సినిమాలను ప్రేక్షకులు, మీడియా ఎప్పుడూ ఆదరించాలని, సెప్టెంబర్ 18న వస్తున్న ఈ కంటెంట్ రిచ్ మూవీ కచ్చితంగా విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఈ చిత్రంలో రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య, గోపరాజు రమణ, వెంప కాశి, కౌశిక్, మహిపాల్, రుచిత, నళిని, శ్రీనివాస్, అజీమ్, పండు తదితరులు నటించారు. సాంకేతిక వర్గం విషయానికి వస్తే.. నిర్మాతగా పంచుమర్తి నరేష్ బాబు, సహ నిర్మాతగా దివెళా శ్రీనివాస్ రావ్, దర్శకత్వం వాచస్పతి, కథ & స్క్రీన్‌ప్లే వనరాజ్, సంభాషణలు వెంకట్ బద్దిగం, సంగీతం ఆర్.ఆర్.ధృవన్, ఛాయాగ్రహణం శామ్. కె. నాయుడు, ఎడిటింగ్ బసవా వ్యవహరించారు. సెప్టెంబర్ 18న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.