– రామవరం పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ ముస్తఫాకు సత్కారం
రుద్రంపూర్, సెప్టెంబర్ 15 : ప్రజా సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తూ సమాజ సేవలో ముందుకు సాగుతున్న రామవరం పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ ముస్తఫాకు జాతీయ సేవారత్న పురస్కారం లభించింది. ఇన్ఫాక్ట్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ 15వ వార్షికోత్సవ సభను బెంగళూరులో నిర్వహించగా, వివిధ రంగాల్లో సేవలందిస్తున్న స్వచ్ఛంద సంస్థలకు చెందిన సుమారు వందమంది ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితుడిగా మహమ్మద్ ముస్తఫా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహమ్మద్ ముస్తఫా మాట్లాడుతూ జాతీయ భావంతో కూడిన జీవన విధానాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలన్నారు. మనిషిని మనిషిగా గౌరవించే సమాజ నిర్మాణానికి నేటి యువత ప్రధానంగా ముందుకు కదలాలని పిలుపునిచ్చారు. సమాజంలో మానవతా విలువలు, పరస్పర గౌరవం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని సూచించారు.
తాను స్వగ్రామంలో నిర్వహించిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలను గుర్తించి ఈ పురస్కారం అందించడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ అవార్డు తనది కాదని, తన గ్రామ ప్రజలదని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని ప్రజా సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించేందుకు ఈ పురస్కారం ప్రోత్సాహంగా నిలుస్తుందన్నారు. తన సేవలను గుర్తించి జాతీయ సేవారత్న పురస్కారానికి ఎంపిక చేసిన ఇన్ఫాక్ట్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఫౌండర్, ప్రెసిడెంట్ ఎస్. శివరాజుకు మహమ్మద్ ముస్తఫా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ పురస్కారాన్ని ఐఆర్ఎస్ కస్టమ్స్ అధికారి డాక్టర్ జల్ది విద్యాధర్, ధర్మవరపు నరేందర్రెడ్డి, సంస్థ అధ్యక్షుడు సోమల శివరాజు చేతుల మీదుగా అందుకున్నారు.