హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ) : టీచర్లకు శిక్షణ.. విద్యార్థులకు శిక్ష అన్నట్టుగా మారింది రాష్ట్రంలో సర్కార్ బడుల్లో చదువుకునే విద్యార్థుల పరిస్థితి. ‘విద్యాసంవత్సరం మధ్యలో టీచర్స్‌కు ట్రైనింగ్స్ ఉండవు.. వేసవి సెలవుల్లోనే శిక్షణ పూర్తిచేస్తాం’ ఇది నిరుడు విద్యాశాఖ ఉన్నతాధికారులు చెప్పిన మాటలు. అయితే వారు చెప్పిన మాటలను ఉల్లంఘిస్తూ.. విద్యాసంవత్సరం ప్రారంభమయ్యాక ఉపాధ్యా యులకు శిక్షణ ఇస్తున్నారు. దీంతో సర్కార్ బడుల్లోనే విద్యనభ్యసించే విద్యార్థుల విద్యకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ప్రస్తుతం రాష్ట్రంలోని సర్కార్ బడుల్లోని టీచర్లకు వృత్యంతర శిక్షణలో భాగంగా పాఠశాల విద్యాశాఖ ట్రైనింగ్స్ ఇస్తున్నది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ షెడ్యూల్‌ను విడుదల చేసింది. జూలై, ఆగస్టు మాసాల్లో శిక్షణ ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. ముందుగా రాష్ట్రస్థాయిలో రిసోర్స్‌పర్సన్స్‌కు శిక్షణనివ్వగా, వీరు ప్రస్తుతం జిల్లాల్లో శిక్షణ ఇస్తున్నారు.
సర్కార్ ఉపాధ్యాయులతోపాటు మాడల్ స్కూల్, కేజీబీవీ టీచర్లు. హెచ్ఎంలకు ‘ఇంటిగ్రేటెడ్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫర్ క్వాలిటీ లెర్నింగ్ త్రూ ట్రాన్స్ఫర్మేటివ్ క్లాస్రూమ్ ప్రాక్టీస్’ అంశంపై శిక్షణ ఇస్తున్నారు. మూడు విడుతల్లో మూడు రోజులపాటు శిక్షణ కల్పిస్తున్నారు. జిల్లాస్థాయి శిక్షణలు ఈనెల 31తో ముగియనున్నాయి. ప్రస్తుతం 24జిల్లాల్లో ట్రైనింగ్స్ నడుస్తున్నాయి. అయితే కొందరు టీచర్లు అయిష్టంగానే ఈ శిక్షణకు హాజరవుతున్నారు. ఈ శిక్షణలు అంతంత మాత్రంగానే నిర్వహిస్తున్నారని పేర్కొంటున్నారు.
శిక్షణ రోజుల్లో టీచర్లు మూడు రోజులు స్కూళ్లకు దూరంగా ఉండనున్నారు. దీంతో ఆయా బడుల్లో బోధనకు ఆటంకమేర్పడుతున్నది. మరీ ముఖ్యంగా సింగిల్ టీచర్ స్కూళ్లల్లో ఉన్న ఒక్క టీచర్ ట్రైనింగ్‌కు వెళితే పాఠాలు చెప్పేవారు లేని పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలో 4,739 సింగిల్ టీచర్ స్కూళ్లు ఉండగా, ఈ మూడురోజులు పాఠాలు బోధించే వారు లేని పరిస్థితులు ఉన్నాయి. ఇక ఇద్దరు టీచర్లు ఉన్న బడుల్లోనూ పాఠాలు చెప్పడం కష్టమవుతుందని టీచర్లు చెబుతున్నారు. విద్యాసంవత్సరం ప్రారంభమై నెల రోజుల్లోనే టీచర్లను శిక్షణ పేరిట స్కూళ్లకు దూరం చేయడం పట్ల టీచర్లతోపాటు విద్యార్థుల తల్లిదండ్రులు సైతం ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. టీచర్లకు సెలవు రోజుల్లో.. ఆన్లైన్లో శిక్షణల్వివడం ఉత్తమమని అభిప్రాయపడుతున్నారు.