Singareni Hospitals | గోదావరిఖని : సింగరేణి ఆస్పత్రుల్లో ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు నిరంతరం మందులు సరఫరా చేసే విధంగా యాజమాన్యం చర్యలు తీసుకోవాలని సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు దండంరాజు రాంచందర్ రావు, ప్రధాన కార్యదర్శి భూపెల్లి బానయ్య, ఉప ప్రధాన కార్యదర్శి అళవందార్ వేణు మాధవ్ డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సింగరేణిలో దాదాపు నలభై వేల మంది ఉద్యోగులు, ఎనభై మూడు వేల మంది రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నారని, వీరిలో చాలా మంది సింగరేణి ప్రాంతాల్లో నివసిస్తున్నారని వారు పేర్కొన్నారు. వీరిలో కొందరు కంపెనీ ఆసుపత్రుల్లో ఔట్ పేషంట్ ట్రీట్మెంట్తోపాటు నెల వారిగా వాడే బీపీ,షుగర్, గుండె, మోకాళ్ల నొప్పులకు సంబంధించిన మందులు వాడుతున్నారని, మరికొంతమంది తమ స్వగ్రామాల్లో నివసించడం, కొంతమంది తమ పిల్లలు పని చేసే నగరాలైన హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం లాంటి పట్టణాల్లో వారిపై ఆధారపడి నివసిస్తున్నారని వారు తెలిపారు. వీరు ప్రతీ నెల కంపెనీ దవాఖానకు వచ్చి మందులు తీసుకోవడం జరుగుతుందన్నారు.
ఈ మధ్యన సింగరేణి హాస్పిటల్లో మందులు తగినంత సరఫరా లేనందువల్ల కొరత ఏర్పడిందని, మందుల కొరత వలన ఆసుపత్రి సిబ్బంది నెలకు సరిపడా మందులు ఇవ్వకపోవడంతో వారానికి ఒక సారి ఆసుపత్రులకు రావలసి వస్తుందన్నారు. తమ అవసరాలు తీర్చని పెన్షన్, వయోభారంతో బ్రతుకుతున్న విశ్రాంత ఉద్యోగులు ప్రతీ వారం కంపెనీ ఆస్పత్రికి రావడం కష్టంతో కూడుకున్న వ్యవహారమని, కనుక సింగరేణి యాజమాన్యం మానవతా దృక్పథంతో ఆలోచించి, ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు నిరంతరం మందులు సరఫరా చేసే విధంగా చర్యలు చేపట్టి వారిని ఆదుకోవాలని సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ కోరుతుందన్నారు.