Koppula Eshwar | ధర్మారం, మే 19: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బొమ్మరెడ్డిపల్లి గ్రామంలో మరణించిన గొర్రెలకు జిల్లా కలెక్టర్ ప్రత్యేక నిధి ద్వారా పరిహారం చెల్లించి బాధిత గొర్రెల పెంపకం దారులను ఆదుకోవాలని రాష్ట్ర మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత కొప్పుల ఈశ్వర్ కోరారు. బొమ్మరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఐదుగురు గొర్రెల పెంపకం దారులకు చెందిన 96 గొర్రెలు మృతి చెందగా.. తాజాగా సోమవారం మరో 7 గొర్రెలు మరణించాయనే సమాచారం తెలుసుకుని కొప్పుల ఈశ్వర్ ఆ గ్రామానికి వెళ్లారు. బాధిత గొర్రెల పెంపకం దారులను ఆయన పరామర్శించారు.
గొర్రెల మరణానికి గల కారణాలను యాదవులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. మూకుమ్మడిగా వందకు పైగా గొర్రెలు మేతకు వెళ్లి విషాహారం తిని మరణించడం బాధాకరమని అన్నారు. మూగజీవాల మృతి వల్ల గొర్రెల పెంపకందారులకు తీవ్రమైన నష్టం కలిగి.. వారు ఉపాధి కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక గొర్రెల పథకం ప్రస్తుతం లేనందున జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపి తన నిధి ద్వారా పరిహారం చెల్లిస్తేనే నష్టపోయిన బాధిత గొర్రెల పెంపకం దారులకు న్యాయం జరుగుతుందని అన్నారు. లేనిపక్షంలో బాధితులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు.
ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ మానవతా దృక్పథంతో స్పందించాలని కొప్పుల ఈశ్వర్ కోరారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రత్యేక గొర్రెల పథకం ఉండడం వలన ప్రమాదవశాత్తు సామూహికంగా పెద్ద సంఖ్యలో మరణిస్తే గొర్రెల స్థానంలో తిరిగి వారికి తమ ప్రభుత్వం ఇచ్చేదని అన్నారు. ప్రస్తుతం గొర్రెల బీమా పథకం లేకపోవడంతో వారికి తగిన న్యాయం జరిగే అవకాశం లేనందున జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా వారికి తగిన పరిహారం అందించి ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తాను సైతం జిల్లా కలెక్టర్‌ను కలిసి బాధిత గొర్రెల పెంపకం దారులకు పరిహారం చెల్లించాలని కోరుతానని బాధిత పెంపకం దారులకు కొప్పుల ఈశ్వర్ హామీ ఇచ్చారు. ఆయన వెంట పార్టీ నాయకులు ఉన్నారు.
Street lights | పట్టపగలే వెలుగుతున్న వీధిలైట్లు.. పట్టించుకోని మున్సిపల్ సిబ్బంది
Collector Rahul Raj | ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించాలి.. వైద్య సిబ్బందితో కలెక్టర్ రాహుల్ రాజ్