Kohitur Mangoes | ఎండాకాలం రానే వచ్చింది. ఎండాకాలం అనగానే ముందుగా గుర్తుకు వచ్చేవి మామిడిపండ్లు. వీటిని ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. త్వరలోనే మార్కెట్లన్నీ మామిడిపండ్లతో నిండిపోతాయని చెప్పవచ్చు. మామిడిపండ్లల్లో కొన్ని రకాల మామిడిపండ్లు ప్రజల దృష్టిని ఎక్కువగా ఆకర్షిస్తాయి. ప్రజల దృష్టిని ఎక్కువగా ఆకర్షించే వివిధ రకాల మామిడిపండ్లల్లో పశ్చిమ బెంగాల్ కు చెందిన కోహితూర్ మామిడిపండు కూడా ఒకటి. ఇది అరుదుగా లభించే మామిడి పండు కారణంగా ప్రసిద్ది చెందింది, ఈ పండు అందరికీ అందని పండు అని చెప్పవచ్చు. ఈ రకం మామిడిపండు ముర్షిదాబాద్ రాజవంశపు చరిత్రతో ముడిపడిన ప్రీమియం రకం పండు కావడం విశేషం.
ఒక్కో మామిడిపండు ధర సుమారు రూ.1500 అంతకంటే ఎక్కువగా ఉంటుంది. ఈ పండును రక్షించడానికి పత్తితో మృదువుగా చుట్టి ఉంచుతారు. ప్రతి సంవత్సరం చాలా తక్కువ పరిమాణంలో మాత్రమే కోత జరుగుతుంది కనుక దీని అరుదుతనం మరింత పెరుగుతుంది. అలాగే కోహితూర్ మామిడిపండును బెంగాల్ లో అత్యంత ప్రతిష్టాత్మక మామిడిపండ్లల్లో ఒకటిగా భావిస్తారు. ఈ పండు Siraj-ud-Daulah కాలానికి చెందినది అని చరిత్ర చెబుతోంది. ఆ కాలంలో ఉండే అత్యుత్తమ మామిడి మొక్కలతో అరుదైన కాలోపహర్ రకంతో కలిపి గ్రాఫ్టింగ్ ద్వారా ఈ రకాన్ని అభివృద్ది చేసినట్టు సమాచారం. అదే విధంగా ఈ కోహితూర్ మామిడి మొక్కలు కొద్ది సంఖ్యలో మాత్రమే ఉన్నాయి. కొన్ని సంవత్సరాల్లో వీటి దిగుబడి 150 పండ్లు మాత్రమే అని సమాచారం.
అంతేకాకుండా కోహితూర్ మామిడిపండ్లు చాలా మృదువుగా ఉంటాయి. వీటిని లోహపు కత్తితో కాకుండా చెక్క కత్తితో కట్ చేస్తారు. చేతి వేడి కూడా వీటి పక్వంపై ప్రభావాన్ని చూపిస్తాయి. అందుకే వీటిని పత్తితో కప్పి నిల్వ చేస్తూ ఉంటారు. ఈ పండ్లను చెట్ట నుండి కోయడానికి కత్తెరను ఉపయోగించరు. వెదురు చీలికలతో నెమ్మదిగా కిందకు నెట్టి తీస్తారు. కాడకు చిన్న గాయం అయినా కూడా రుచిపై ప్రభావం చూపుతుందని చాలా నెమ్మదిగా కోస్తారు. నవాబు కాలంలో ఈ తోటలను ప్రత్యేక నైపుణ్యం ఉన్న వారు మాత్రమే పర్యవేక్షించేవారు. శతాబ్దాల తరువాత కూడా కోహితూర్ మామిడి తన మహిమను కొనసాగిస్తుందని చెప్పవచ్చు. విస్తృతంగా సాగు చేయకపోయినా, సులభంగా అందుబాటులో లేకపోయినా, అరుదైన రుచులపై ఆసక్తి ఉన్న వారికి ఇది అత్యంత ఆకర్షణీయమైన మామిడిపండుగా మారింది.