హైదరాబాద్, ఆగస్టు 16, (నమస్తే తెలంగాణ): ‘సర్’ ప్రక్రియలో డ్రాఫ్ట్ లిస్ట్ నుంచి తుది ఓటర్ జాబితా వచ్చే దశ అత్యంత కీలకమైనదని, అర్హులైన ప్రతి ఓటరు పేరూ జాబితాలో కొనసాగేలా చూడటం, తప్పులను తక్షణమే సరిదిద్దడం ద్వారా ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ముఖ్యనేతలు, నియోజకవర్గ ఇన్చార్జులు, కార్యకర్తలతో అదివారం ఆయన టెలికాన్ఫరెన్‌లో మాట్లాడారు.
‘సర్’ ప్రకియలో డ్రాఫ్ట్ లిస్ట్ నుంచి తుది ఓటరు జాబితా వచ్చే దశలో చేయాల్సిన పనులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారు. చివరి దశలో బీఎల్ఏలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నెలన్నర నుంచి బీఎల్ఏలు చేసిన కృషిని కొనసాగిస్తూ ఈ చివరి దశలో మరింత సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. స్థానిక, మండల నాయకులు, ఇన్చార్జులు ఈ ప్రక్రియను సమర్థవంతంగా పర్యవేక్షించి, ఏవైనా సమస్యలు ఎదురైతే తక్షణమే రాష్ట్ర స్థాయి కమిటీ దృష్టికి తేవాలని సూచించారు.
ఎలక్షన్ కమిషన్ విడుదల చేయనున్న డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్‌ను ప్రతి నియోజకవర్గం, మండలం, డివిజన్, బూత్ స్థాయిలో తక్షణమే అందుబాటులోకి తేవాలని కేటీఆర్ ఆదేశించారు. ప్రతి బీఎల్ఏ వద్ద 2025 ఓటరు లిస్టుతో పాటు రాబోయే 2026 డ్రాఫ్ట్ ఓటర్ లిస్టు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలని సూచించారు. అవసరమైన చోట తెలంగాణ భవన్ నుంచి నేరుగా డ్రాఫ్ట్ లిస్ట్‌లు బీఎల్ఏలకు చేరేలా ఇన్చార్జులు సమన్వయం చేసుకోవాలని తెలిపారు.
మండల, స్థానిక నాయకులు బీఎల్ఏలతో సమన్వయం చేసుకొని క్షేత్రస్థాయిలో ఇంటింటి పరిశీలన పూర్తిచేయాలని కేటీఆర్ సూచించారు. ప్రతి బీఎల్ఏ తమ పరిధిలో ప్రతి ఇంటికీ వెళ్లి, ఓటు లిస్ట్‌లో ఉన్నదో? లేదో? సరిచూసుకోవాలని చెప్పారు. అర్హత ఉండీ ఓటు లేని వారిని గుర్తించడంతో పాటు డూప్లికేట్ ఓట్లను గుర్తించి సంబంధిత ఆధికారుల దృష్టికి తీసుకుపోవాలని కోరారు. ప్రతి బీఎల్ఏ రోజుకు సుమారు 50 ఇండ్లను లక్ష్యంగా పెట్టుకొని వారంలో ఓటర్ల సమగ్ర పరిశీలన పూర్తి చేయాలని ఆదేశించారు.
ఫారమ్-6, 7, 8 వినియోగం, ఓటరు నమోదు ప్రక్రియలో ప్రధానమైన మూడు ఫారమ్‌లపై కార్యకర్తలకు, బీఎల్ఏలకు స్పష్టమైన అవగాహన ఉండాలని కేటీఆర్ చెప్పారు. కొత్త ఓటు నమోదు చేయడానికి లేదా అర్హత ఉన్న వ్యక్తి పేరు డ్రాఫ్ట్ లిస్టులో లేకపోతే నమోదు కోసం (ఫారమ్-6), డూప్లికేట్ ఓటు, మరణించిన వారి ఓట్లు లేదా నివసించని వ్యక్తుల ఓట్ల తొలగింపు కోసం (ఫారమ్-7), ఓటర్ల పేరు, తండ్రి/భర్త పేరు లేదా చిరునామా వంటి వివరాలలో మార్పులు, సవరణల కోసం తెచ్చిన ఫారమ్-8పై అవగాహన ఉండాలని తెలిపారు.
‘సర్’ ప్రక్రియలో ఎదురయ్యే అనామలిస్ (లొసుగులు/నోటీసులు) పై ప్రత్యేక దృష్టి పెట్టాలని కేటీఆర్ సూచించారు. నోటీసులు వచ్చిన ఓటర్లకు తగిన మార్గదర్శక త్వం అందించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన సర్ గైడ్ బుక్‌ను ప్రతి బీఎల్ఏకూ అందించాలని నాయకులను కోరారు. ప్రక్రియలో ఏవైనా సందేహాలుంటే రాష్ట్రస్థాయి సర్ బృందంతో నిరంతరం సమన్వయం చేసుకోవాలని తెలిపారు.
ఓటర్ల సహాయం కోసం ఇంటర్నెట్ వనరులు, ఓటరు జాబితాలో పేరు పరిశీలన, నమోదు విధానం, ఫారమ్‌లకు సంబంధించిన అధికారిక సమాచారం కోసం కేంద్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌ను లేదా రాష్ట్ర ఎన్నికల అధికారులకు సంబంధించిన చీఫ్ ఎలక్షన్ ఆపీసర్ తెలంగాణ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.