ములుగు, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ)/ములుగు రూరల్ : గత బీఆర్ఎస్ ప్రభు త్వ హయాంలో ములుగు ప్రత్యేక జిల్లా కోసం ఈ ప్రాంత వాసులు చేసిన పోరాటం ఫలించిన విషయం తెలిసిందే. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని జిల్లాల్లో మాదిరిగానే సమీకృత కలెక్టరేట్ భవనానికి నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించారు. ప్రస్తుతం భవన నిర్మాణం పూర్తికాగా, ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డి పరిపాలన సౌదా న్ని ప్రారంభించడంతో ఈ ప్రాంత ప్రజల స్వప్నం నెరవేరినట్లయ్యింది. అయితే సీఎం పర్యటన సందర్భంగా ములుగు జిల్లా అభివృద్ధికి మరిన్ని వరాలు కురుస్తాయని ఆశ పడ్డ ప్రజలకు నిరాశే ఎదురైంది.
సీఎం తన ప్రసంగంలో గత ప్రభుత్వ పెద్దలతో పాటు బీఆర్ఎస్ నాయకులను విమర్శించడానికే ప్రాధాన్యతనిచ్చారు. మంత్రి సీతక్క సైతం తన ప్రసంగంలో బీఆర్ఎస్ నాయకులపై అక్కసు వెళ్లగక్కుతూ 2023 ఎన్నికల కంటే ముందే పను లు ప్రారంభించిన సమీకృత కలెక్టరేట్‌ను తన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిధులు కేటాయించి నిర్మాణం చేపట్టినట్లు అబద్ధాలు వల్లెవేశారు. మేడారం వైభవాన్ని ప్రపంచానికి చాటేలా చేస్తామని, జంపన్నవాగు, మల్లూరు లక్ష్మీనర్సింహస్వామి ఆలయ అభివృద్ధికి నిధు లు కేటాయిస్తామని అన్నారే తప్ప ఎన్ని విడుదల చేస్తారనేది చెప్పలేదు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ రహదారుల అభివృద్ధి ప్రణాళికకు రూ.16,007 కోట్ల నిధులతో చేపట్టే హ్యామ్ రోడ్ల పథకానికి గట్టమ్మ దేవాలయం ఎదుట ముఖ్యమంత్రి, మంత్రులు, ఎంపీ పైలాన్‌ను ఆవిష్కరించారు.
గత ప్రభుత్వ హయాంలో కేటాయించిన ఎస్పీ కార్యాలయం, కోర్టు భవనాల నిర్మాణాలను వేగవంతం చేస్తామని తెలిపారు. జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావును ఆయన చాంబర్లో కూర్చొబెట్టి శాలువాతో సత్కరించారు. పనిలో పనిగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయ భవన నిర్మాణానికి సైతం ముఖ్యమంత్రి, మంత్రులు గట్టమ్మ సమీపంలో శంకుస్థాపన చేశారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఎంపీలు వేం నరేందర్‌రెడ్డి, బలరాంనాయక్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, జిల్లా ఎస్పీ సుధీర్‌రామ్‌నాథ్ కేకన్, అదనపు కలెక్టర్ మహేందర్‌జీ, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మేడారం పర్యటనకు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హాజరు కాలేదు. దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న మేడారం ఆలయ అభివృద్ధ్ది పనుల పరిశీలన, అమ్మవార్లకు మొక్కులు చెల్లించేందుకు వచ్చిన సీఎం వెంట స్థానిక మంత్రి సీతక్క, మంత్రులు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాత్రమే హాజరై కొండా సురేఖ రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. గతంలో కూడా దూరంగా ఉన్న విషయం తెలిసిందే.
అలాగే ములుగు కలెక్టరేట్ ప్రారంభించిన అనంతరం సీఎం మాట్లాడుతూ మేడారం అభివృద్ధి చాలా గొప్పగా జరిగిందంటూ మంత్రులు సీతక్క, పొంగులేటిని ప్రత్యేకంగా అభినందించి సురేఖను విస్మరించడం చర్చకు దారితీసింది. సీఎంకు మంత్రి సురేఖకు దూరం పెరిగిందా? లేక అసంతృప్తితోనే రాలేదా? అని ప్రజలు మాట్లాడుకోవడం కనిపించింది. అలాగే, పరకాలలో జరిగిన కార్యక్రమంలోనూ సురేఖ పాల్గొనలేదు. కాగా, ములుగు కలెక్టరేట్ భవన ప్రారంభానికి రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హాజరుకాలేదు. శనివారం సాయంత్రం ఆయన పర్యటన షెడ్యూల్ ఖరారైనప్పటికీ సీఎం పర్యటనలో మాత్రం మంత్రి కనిపించలేదు.
తాడ్వాయి/వాజేడు, ఆగస్టు 16 : ము లుగు జిల్లా మేడారంలో ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డి కొత్త పింఛన్లు పంపిణీ చేశారు. అంతకుముందు ఆదివాసీ గిరిజన దైవాలైన సమ్మక్క, సారలమ్మను దర్శించుకొని పూజలు చేశారు. గద్దెల ప్రాంగణంలో ఇప్ప మొక్కను నాటారు. భక్తుల కోసం ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. అనంతరం చేయూత పథ కం కింద 24 మంది ఒంటరి, వితంతువులు, దివ్యాంగులకు పింఛన్ చెక్కులు అందజేశారు.
మేడారంలో భక్తులకు పోలీసుల నుంచి అడుగడుగునా ఆంక్షలు ఎదురయ్యాయి. మూడు గంటల పాటు దర్శనానికి అనుమతి ఇవ్వకుండా క్యూ గేట్లు మూసివేయడంతో ఇబ్బందులు ప డ్డారు. సీఎం వచ్చి వెళ్లేంత వరకు వృద్ధులు, చంటిబిడ్డలతో అవస్థలు పడ్డారు. ఒడి బియ్యం పో యడానికి కుటుంబసభ్యులతో కలిసి హైదరాబాద్ నుంచి వస్తే గంట నుండి అనుమతి ఇవ్వ లేదని ఓ భక్తురాలు ఆవేదన వ్యక్తం చేసింది.