న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21 : తన అత్యున్నత జాతీయ సైనిక అప్రమత్తత ప్రోటోకాల్‌ను(అంతర్గ్గతంగా కోడ్ 100గా పిలుస్తారు) ఇరాన్ యాక్టివేట్ చేసిందన్న వార్తల నేపథ్యంలో పశ్చిమాసియా అంతటా ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి పెరిగినట్టు కనిపిస్తున్నది. సైనిక చర్యకు ముందు ఈ క్రియాశీలత ద్వారా ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్(ఐఆర్జీసీ), రెగ్యులర్ ఆర్మీ(ఆర్టెష్), వైమానిక రక్షణ కమాండ్లు, అంతర్గత భద్రతా సర్వీసులతో సహా ఇరాన్ సాయుధ దళాల్లోని అన్ని విభాగాలను సర్వ సన్నద్ధంగా ఉంచుతుందని సమాచారం. వారాంతంలో జరిగిన వరుస పరిణామాల నేపథ్యంలో ఈ ఆకస్మిక హెచ్చరిక జారీ అయింది. ఇరాన్‌కు అనుకూలమైన యెమెన్‌లోని హౌతీ దళాలు సౌదీ రాజధాని రియాద్‌పై భారీ బాలిస్టిక్ క్షిపణి, డ్రోన్ దాడి చేయడం ఈ పరిణామాలలో ప్రధానమైనది.
దీనికి ప్రతిస్పందనగా అమెరికా విదేశాంగ శాఖ ఆ ప్రాంతమంతటా అత్యవసర భద్రతా హెచ్చరికలను జారీ చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరాన్ దేశానికి వెళ్లొద్దని, ఇప్పటికే అక్కడ ఎవరైనా ఉంటే వెంటనే తిరిగి యూఎస్‌కు వచ్చేయాలని తెలిపింది. ఆకస్మిక ఉద్రిక్తతలు, వాణిజ్య విమానాల రద్దులు, ప్రాంతీయ గగనతలాన్ని మూసివేసే అవకాశాలకు సిద్ధంగా ఉండాలని అమెరికా పౌరులకు విదేశాంగ శాఖ సూచించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అప్రకటిత జాతీయ భద్రతా సమావేశాల కోసం క్యాంప్ డేవిడ్‌లో తన బసను హఠాత్తుగా ముగించుకుని వైట్ హౌస్‌కు తిరిగి రావడంతో పరిస్థితి తీవ్రత స్పష్టమైంది. అధికారిక ఇరాన్ ప్రభుత్వ మీడియా కోడ్ 100 క్రియాశీలతపై మౌనం వహిస్తున్నప్పటికీ ఇరాన్లో అంతర్గతంగా జరుగుతున్న సైనిక కదలికలు యుద్ధానికి సన్నద్ధతను సూచిస్తున్నట్టు నిపుణులు పేర్కొన్నారు.
ఇరాన్‌కు చెందిన సైనిక వర్గీకరణలో కోడ్ 100 అనేది అత్యవసర రక్షణ సన్నద్ధతలో అత్యున్నత స్థాయిని సూచిస్తుంది. దేశానికి చెందిన మొత్తం రక్షణ వ్యవస్థను తక్షణ యుద్ధ సన్నద్ధత స్థితికి మార్చడానికి కోడ్ 100 రూపకల్పన జరిగింది. సైనిక కమాండ్ విభాగాలన్నింటిలో కోడ్ 100 ప్రకటించినపుడు లేదా అమలు చేసినపుడు ఇరాన్‌కు చెందిన రెండు అంచెల సైనిక వ్యవస్థ అంతటా అనేక అత్యున్నత ప్రాధాన్యతతో కూడిన ఆదేశాలు ఆటోమేటిక్‌గా అమల్లోకి వస్తాయి. ఇరాన్లో క్షిపణి నగరాలుగా పిలిచే భూగర్భ క్షిపణి సలోలు, ఆర్జీసీ ఏరోస్పేస్ ఫోర్స్ నిర్వహించే మొబైల్ లాంచర్ యూనిట్లను శత్రు వైమానిక దాడుల ద్వారా జరిగే విధ్వంసాన్ని నివారించడానికి ముందస్తుగా ద్వితీయ ప్రయోగ కేంద్రాలకు తరలిస్తారు.