హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ) : పేదింటి ఆడబిడ్డల ఆత్మగౌరవానికి, ఆర్థిక భరోసాకు అండగా నిలిచిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను పూర్తిగా రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. హైకోర్టును సాకుగా చూపుతూ లక్షలాది నిరుపేద కుటుంబాలకు భరోసా కల్పించకుండా ఈ పథకాలను ఉద్దేశపూర్వకంగా ఎత్తివేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ మోసపూరిత వైఖరిని ప్రజల ముందు ఉంచేందుకు, కుట్రలను అడ్డుకునేందుకు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ, మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ప్రజాప్రతినిధులు, రాష్ట్ర జనరల్ బాడీ సభ్యులతో ఆదివారం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో కేటీఆర్ దిశానిర్దేశం చేశారు.
పేద కుటుంబాలకు ఆడబిడ్డల పెండ్లి ఆర్థిక భారం కాకూడదనే తెలంగాణ ఏర్పడిన వెంటనే కేసీఆర్ 2014 అక్టోబర్ 2న ఈ పథకాలను ప్రారంభించారని కేటీఆర్ గుర్తుచేశారు. రూ. 51వేల ఆర్థిక సాయంతో ప్రారంభమైన ఈ పథకాన్ని రూ.1,00,116కు పెంచారని తెలిపారు. కేసీఆర్ హయాంలో సుమారు 13 లక్షల మంది ఆడబిడ్డల కుటుంబాలకు రూ.13 వేల కోట్ల మేర సాయమందించినట్టు చెప్పారు.
ఎన్నికల సమయంలో కల్యాణలక్ష్మితో పాటు ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చిన తర్వాత పథకాన్ని బలోపేతం చేయాల్సింది పోయి దాన్ని మొత్తానికే రద్దు చేసేందుకు ప్రయత్నిస్తున్నదని కేటీఆర్ విమర్శించారు. కల్యాణలక్ష్మి కోసం ఎదురుచూస్తున్న ప్రతి ఆడబిడ్డా ఇప్పుడు ఎన్నికల హామీ ప్రకారం తులం బంగారం కూడా డిమాండ్ చేస్తుండటంతో, ఆ ప్రశ్నల నుంచి తప్పించుకునేందుకే కాంగ్రెస్ ఈ పథకాన్ని పూర్తిగా ఎత్తివేసే కుట్ర చేస్తున్నదని మండిపడ్డారు. చాలా కాలం తర్వాత ఆమోదం పొందిన దరఖాస్తులకు సంబంధించిన చెకులు కూడా పూర్తిస్థాయిలో పంపిణీ కాకుండా ఆగిపోయాయని పేర్కొన్నారు. పెండింగ్లో ఉన్న అన్ని అర్హత ఉన్న దరఖాస్తులను వెంటనే పరిషరించి, ఆర్థిక సాయం విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
కల్యాణలక్ష్మి అంశం హైకోర్టు పరిధిలో ఉన్న సమయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై కేటీఆర్ మండిపడ్డారు. నాలుగుసార్లు గడువు ఇచ్చినా ప్రభుత్వం కౌంటర్ ఎందుకు దాఖలు చేయలేదని ప్రశ్నించారు. పేదింటి ఆడబిడ్డల ప్రయోజనాలకు సంబంధించిన కీలకమైన అంశంలో ప్రభుత్వం సరైన వాదనలు ఎందుకు వినిపించలేకపోయిందని నిలదీశారు. ముఖ్యమంత్రి, మంత్రుల అవినీతి, హైడ్రా వంటి అంశాల్లో ప్రైవేట్ న్యాయవాదులకు భారీ మొత్తాలు చెల్లించి వాదింపజేసుకునే ప్రభుత్వం, ఆడబిడ్డల హకులకు సంబంధించిన పథకాన్ని కాపాడుకునే విషయంలో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించిందని నిప్పులు చెరిగారు. ‘ఆడబిడ్డ భారం కాదు.. భరోసా’ అనే భావనకు కేసీఆర్ ప్రభుత్వం రూపమిచ్చిందని గుర్తుచేశారు. అలాంటి పథకాలను రద్దు చేస్తే తెలంగాణ ఆడబిడ్డలు, వారి కుటుంబసభ్యులు కాంగ్రెస్ సర్కార్కు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు.
సోమవారం రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ, మండల కేంద్రాల్లో నిర్వహించే నిరసనల్లో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని పేదింటి ఆడబిడ్డల పక్షాన తమ గళం వినిపించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ప్రతి గ్రామం, వార్డులో కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని సూచించారు. ‘కల్యాణలక్ష్మి ఏమైంది? షాదీ ముబారక్ ఏమైంది? ఎన్నికల్లో హామీ ఇచ్చిన తులం బంగారం ఎప్పుడిస్తరు?’ అంటూ కాంగ్రెస్ నేతలను ప్రజలు ప్రశ్నించేలా చైతన్యం కలిగించి, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు పోరాడాలని పిలుపునిచ్చారు.