న్యూఢిల్లీ: ఆపరేషన్ సింధూర్(Operation Sindoor) గురించి మీడియాతో మాట్లాడుతున్న కల్నల్ సోఫియా ఖురేషిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షాపై సిట్ దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులతో ప్రత్యేక సిట్ బృందాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఐజీ ర్యాంక్ ఆఫీసర్ సిట్‌కు నాయకత్వం వహిస్తారు. మంగళవారం 10 గంటల్లోగా ఆ బృందాన్ని ఏర్పాటు చేయాలని సుప్రీం తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. అయితే ముగ్గురు సభ్యుల బృందంలో ఓ మహిళా ఎస్పీ ర్యాంక్ అధికారి కూడా ఉండాలని కోర్టు పేర్కొన్నది. మే 28వ తేదీలోగా ఫస్ట్ స్టేటస్ రిపోర్టును సమర్పించాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో మంత్రిని అరెస్టు చేయరాదు అని అత్యున్నత న్యాయస్థానం స్టే ఇచ్చింది.
ఆర్మీ ఆఫీసర్ కల్నల్ సోఫియా ఖురేషిని ఉద్దేశిస్తూ గత వారం మంత్రి విజయ్ షా తన వ్యాఖ్యలతో రాజకీయ దుమారం సృష్టించారు. ఉగ్రవాదులు హిందూ సోదరుల్ని చంపేశారని, వారి సోదరిని ఆర్మీ విమానంలో ఉంచి ఉగ్రవాదుల ఏరివేతకు మోదీ పంపారని, ఉగ్రవాదలు మన సోదరీమణులను వితంతవులుగా మార్చారని, అందుకే ఆ వర్గానికి చెందిన సోదరిని వారికి గుణపాఠం చెప్పందకు పంపినట్లు పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం అవుతున్నది. మంత్రి వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో.. హైకోర్టు ఆదేశాల ప్రకారం ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
తన వ్యాఖ్యల పట్ల ఆ తర్వాత మంత్రి క్షమాపణలు చెప్పారు. ఒకవేళ ఎవరైనా బాధపడి ఉంటే, వారికి పది సార్లు అయినా క్షమాపణలు చెబుతానని అన్నారు.