Social Media Ban | బెంగళూరు: పిల్లలు సోషల్‌మీడియా వాడకుండా నిషేధం విధిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రభుత్వాలు ప్రకటించాయి. తమ రాష్ట్రంలో 13 ఏండ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా నిషేధం విధిస్తున్నట్టు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం శాసనసభలో ప్రకటించారు. 90 రోజుల్లోగా దీన్ని అమలు చేస్తామని చెప్పారు. సామాజిక మాధ్యమ దుష్ప్రభావాలు పిల్లలపై పడకుండా ఉండేందుకే ఈ చర్యలు చేపట్టినట్టు తెలిపారు. 13-16 ఏండ్ల పిల్లలు కూడా సామాజిక మాధ్యమాలు వాడకుండా చేయడంపై ఆలోచిస్తామన్నారు. మరో వైపు తమ రాష్ట్రంలో 16 ఏండ్ల లోపు వారు సోషల్ మీడియా వాడకుండా నిషేధం విధించనున్నట్టు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య శుక్రవారం అసెంబ్లీలో ప్రకటించారు.
అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ 16 ఏండ్ల లోపు పిల్లలు మొబైల్ ఫోన్ కలిగి ఉండొచ్చని.. కానీ సోషల్ మీడియాను ఉపయోగించకూడదని ఆయన అన్నారు. ఇది ఎలా అమలు చేస్తారన్న మీడియా ప్రశ్నకు.. తమ వద్ద ఒక ప్రోగ్రాం సిద్ధం అవుతున్నదని, అది ఖరారయ్యాక దాన్ని ఎలా అమలు చేస్తామన్నది వెల్లడిస్తామని ఆయన తెలిపారు. దీంతో దేశంలో పిల్లలు సామాజిక మాధ్యమాలు వాడకుండా నిషేధం విధించిన తొలి రెండు రాష్ర్టాలుగా ఏపీ, కర్ణాటక నిలిచాయి.
ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు పిల్లల సోషల్ మీడియా వాడకంపై నిషేధం విధించాలని ఆలోచిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఈ చర్యలు తీసుకున్నాయి. అయితే సామాజిక మాధ్యమాలను పిల్లలు వాడకుండా పూర్తిగా నిషేధించే బదులు దానిపై నియంత్రణ విధించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆన్లైన్ ద్వారా డిజిటల్ ప్రపంచంలో వారు ఎన్నో మంచి విషయాలు నేర్చుకొనే అవకాశం కూడా ఉందని వారు వివరిస్తున్నారు. పిల్లలు సోషల్ మీడియా వాడుతున్నప్పుడు తల్లిదండ్రులు పర్యవేక్షించాలని సూచించారు. వ్యక్తిగత విషయాలు, సున్నిత సమాచారాన్ని పిల్లలు ఆన్లైన్లో ఇతరులతో పంచుకోకుండా చూడాలని వారు సూచించారు. కొందరు తల్లిదండ్రులు, మానసిక వైద్యులు మాత్రం ఏపీ, కర్ణాటక ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.
16 ఏండ్లలోపు పిల్లలు ప్రజాదరణ పొందిన సామాజిక మాధ్యమాల్లో ఖాతాలు కలిగి ఉండకుండా నిషేధం విధిస్తూ ఇండోనేషియా శుక్రవారం నిబంధనలు జారీ చేసింది. తాజా నిబంధన ప్రకారం 16 ఏండ్లలోపు పిల్లలు యూట్యూబ్, టిక్ టాక్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్, గేమింగ్ ప్లాట్ ఫామ్ రొబ్లాక్స్ లాంటి ప్లాట్‌ఫామ్స్‌లో కొత్త అకౌంట్లు క్రియేట్ చేయడానికి, ప్రస్తుతం ఉన్నవాటిని కొనసాగించడానికి వీల్లేదు.