గాంధీనగర్: గుజరాత్లో చండీపుర వైరస్ కలకలం రేపుతున్నది. ఈ వైరస్ సోకి ఇప్పటి వరకు 22 మంది పిల్లలు మరణించారు. మరో ఏడుగురు పిల్లలు పలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. (Chandipura virus) గుజరాత్లో ఇప్పటి వరకు నమోదైన 184 అనుమానిత కేసులలో 35 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయిందని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ప్రఫుల్ పన్సేరియా తెలిపారు. మరో 11 నమూనాల పరీక్షా ఫలితాలు ఇంకా రావాల్సి ఉందని చెప్పారు. వైరస్ నిర్ధారణ అయిన ఏడుగురు పిల్లలు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారని వివరించారు. గాంధీనగర్, సబర్కాంత-హిమ్మత్‌నగర్, పటాన్, రాజ్‌కోట్, భావ్‌నగర్ ఆసుపత్రులలో చేరిన పిల్లలకు నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో ప్రత్యేక చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఆరుగురు పిల్లలు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని వెల్లడించారు.
కాగా, చండీపుర వైరస్ సోకినట్లు నిర్ధారణ అయిన వారంతా 15 ఏళ్ల లోపు వయస్సున్న పిల్లలేనని మంత్రి ప్రఫుల్ పన్సేరియా తెలిపారు. ఈ ఇన్ఫెక్షన్లు కేవలం ఒక గ్రామం లేదా జిల్లాకే పరిమితం కాలేదని ఆయన స్పష్టం చేశారు. గుజరాత్‌లోని వివిధ ప్రాంతాల నుంచి కేసులు నమోదవుతుండటంతో ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమైనట్లు చెప్పారు. వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి, ఆరోగ్య శాఖ బృందాలు నిఘాను ముమ్మరం చేశాయని, పెద్ద ఎత్తున పురుగుమందులను పిచికారీ చేస్తున్నట్లు వివరించారు. ప్రజలు భయాందోళన చెందవద్దని, వదంతులను పట్టించుకోవద్దని అన్నారు. పిల్లల్లో లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రులకు తీసుకెళ్లాలని సూచించారు.
మరోవైపు చండీపుర ఎన్సెఫలైటిస్ అనేది ఒక అరుదైన వైరల్ వ్యాధి. ఇది ప్రధానంగా ఇసుక ఈగల ద్వారా వ్యాపిస్తుంది. మెదడు వాపునకు కారణమవుతుంది. ఈ వైరస్‌ను మొట్టమొదట 1965లో మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లా చండీపుర గ్రామంలో గుర్తించారు. ఇది ప్రధానంగా 15 ఏళ్లలోపు పిల్లలపై ప్రభావం చూపుతుంది. సకాలంలో చికిత్స అందించకపోతే వేగంగా ముదిరిపోతుంది. అధిక జ్వరం, వాంతులు, మూర్ఛ లేదా స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. బహుళ అవయవ వైఫల్యంతో సహా తీవ్రమైన అనారోగ్య సమస్యలను నివారించడానికి సత్వర చికిత్స చాలా కీలకం. చండీపుర వైరస్‌కు ప్రస్తుతం నిర్దిష్టమైన టీకా గానీ, యాంటీవైరల్ చికిత్స గానీ అందుబాటులో లేదు.