న్యూఢిల్లీ: ఇండియా, పాకిస్థాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో.. భారత క్రికెట్ నియంత్రణ మండలి కీలక నిర్ణయం తీసుకున్నది. ఆసియా క్రికెట్ మండలి నిర్వహించే అన్ని క్రికెట్ టోర్నీలకు దూరంగా ఉండేందుకు ఇండియా డిసైడైంది. దీంతో పాకిస్థాన్‌ను ఏకాకిని చేయాలన్న ఉద్దేశంతో బీసీసీఐ కసరత్తులు చేస్తోంది. మహిళల ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు ఇప్పటికే ఏసీసీకి బీసీసీఐ చెప్పింది. ఆ టోర్నీని వచ్చే నెలలో శ్రీలంకలో నిర్వహించనున్నారు. ఇక సెప్టెంబర్‌లో జరగనున్న పురుషుల ఆసియా కప్ టోర్నీ నుంచి కూడా ఇండియా తప్పుకున్నట్లు బీసీసీఐ పేర్కొన్నది. వాస్తవానికి ఆ టోర్నీని ఇండియానే నిర్వహించాల్సి ఉంది.
ఆసియా క్రికెట్ మండలి ప్రస్తుతం అధిపతిగా మోషిన్ నఖ్వీ ఉన్నారు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మెన్ కూడా ఆయనే. పాకిస్థాన్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా ఆయన పనిచేస్తున్నారు. ఏసీసీ చీఫ్ ఓ పాకిస్థాన్ మంత్రి, అలాంటి వ్యక్తి నేతృత్వంలో జరిగే టోర్నీల్లో ఇండియా పాల్గొనబోదని బీసీసీఐ పేర్కొన్నది. టోర్నీల నుంచి తప్పుకున్న విషయాన్ని ఏసీసీకి చెప్పామని, కేంద్ర ప్రభుత్వంతో నిత్యం టచ్‌లో ఉన్నట్లు బీసీసీఐ పేర్కొన్నది.
ఇండియా తప్పుకోవడంతో ఆసియా కప్ టోర్నీపై నీలిమేఘాలు కమ్ముకున్నాయి. ఎందుకంటే ఆ టోర్నీకి ఈసారి ఇండియానే ఆతిథ్యం ఇవ్వాల్సి ఉన్నది. ఆసియా కప్ ప్రసార హక్కులను గత ఏడాది సోనీ పిక్చర్స్ నెట్వర్క్ సుమారు 17 కోట్ల డాలర్లకు 8 ఏళ్ల కోసం కొనుగోలు చేసింది. ఒకవేళ టోర్నీ రద్దు అయితే, అప్పుడు ఆ డీల్ గురించి సోనీ వర్కౌట్ చేయాల్సి ఉంటుంది.
ఇండోపాక్ ఉద్రిక్తతల వేళ గతంలో కూడా ఆసియాకప్‌పై ప్రభావం చూపాయి. 2023లో పాకిస్థాన్‌కు భారత జట్టును బీసీసీఐ పంపలేదు. దీంతో ఆ టోర్నీని తటస్థ వేదిక శ్రీలంకలో నిర్వహించారు. ఇండియా అక్కడే అన్ని మ్యాచ్‌లు ఆడింది. ఇలాగే ఇటీవల జరిగిన చాంపియన్స్ ట్రోఫీ కోసం కూడా హైబ్రిడ్ మోడల్‌ను ఆమోదించారు.