గజ్వేల్, ఫిబ్రవరి 20 : గ్రామీణ విద్యార్థులకు సెయింట్ మేరీస్ విద్యానికేతన్ ఉన్నత పాఠశాల (St. Mary’s Vidyaniketan High School) వరంగా మారిందని ట్రస్మా (TRSMA) అధ్యక్షులు మధుసూదన్ అన్నారు. రెండున్నర దశాబ్దాల క్రితం ప్రజ్ఞాపూర్ శివారులో స్థాపించి కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్లడం హర్షనీయమని మధుసూదన్ కొనియాడారు. గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని ప్రజ్ఞాపూర్ సెయింట్ మేరీస్ విద్యానికేతన్లో శుక్రవారం పాఠశాల కరస్పాండెంట్ గోపు ఇన్నారెడ్డితో కలిసి ఆయన సిల్వర్ జూబ్లీ వేడుకలను ప్రారంభించారు.
సిల్వర్ జూబ్లీ వేడుకలను ప్రారంభించిన అనంతరం ట్రస్మా అధ్యక్షులు మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు చక్కటి విద్యను అందించి ఎంతోమందిని అత్యున్నత శిఖరాలకు చేర్చిన ఘనత సెయింట్ మెరీస్ దక్కించుకున్నదని అన్నారు. ఈ పాఠశాలలో చదివిన విద్యార్థులు దేశ, విదేశాలలో ఉన్నత ఉద్యోగాలు చేస్తుండడం, మంచి స్థాయిలో స్థిరపడడం గర్వించదగ్గ విషయమని ఆయన పేర్కొన్నారు. గ్రామీణ విద్యార్థులకు ఆధునిక విద్యతో పాటు అన్ని రకాల సౌకర్యాలను అందిస్తున్న విద్యాసంస్థ కావడం గర్వకారణంగా ఉందని వివరించారు.
ఈ సందర్భంగా గజ్వేల్ ట్రాఫిక్ సీఐ మురళి మాట్లాడుతూ.. ఉమ్మడి మెదక్ జిల్లాలో చక్కటి విద్యా బోధన అందిస్తున్న ఈ పాఠశాల మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. విద్యార్థుల సంస్కృతి కార్యక్రమాలు ఎంతో ఆకర్షించాయని తెలిపిన ఆయన.. విద్యార్థులు సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉంటూ చదువుపై శ్రద్ధ కనబరిచాలని సూచించారు.
ఆద్యంతం కోలాహలంగా సాగిన పాఠశాల సిల్వర్ జూబ్లీ వేడుకల్లో గౌరవ అతిథులు ట్రస్మా కోశాధికారి రాఘవేంద్ర రెడ్డి, పూర్వ విద్యార్థులు డాక్టర్ విజేందర్ రెడ్డి, శాలిని, పాఠశాల డైరెక్టర్ థామస్ రెడ్డి, మూర్తి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.