Thousand Pillar Temple | హనుమకొండ చౌరస్తా: చారిత్రక వేయిస్తంభాల రుద్రేశ్వరాలయంలో క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నామిరెడ్డి సీతారాంరెడ్డి దాతృత్వంలో రూ.10 లక్షలతో ఏర్పాటు చేసిన ఈ క్యూలైన్లను రాష్ట్ర కేంద్ర పురావస్తుశాఖ సూపరింటెండెంట్ డాక్టర్ నిహీల్‌దాస్, డిప్యూటీ సూపరింటెండెంట్ కృష్ణచైతన్య, సీనియర్ సీఐ (CI)లు అజిత్, మల్లేశం ప్రారంభించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి డీ అనీల్‌కుమార్, ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ పూజాకార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం సూపరింటెండెంట్ నిహీల్‌దాస్ కేంద్ర పురావస్తుశాఖ అధికారులతో కలిసి రూ.2 కోట్ల నిధులతో కల్యాణ మంటపం చుట్టూ ప్రదక్షణపథం, కళ్యాణమంటప భూభాగంలో విరిగిపోయిన ద్వారపాలకుల శిల్పాలను తమిళనాడు శిల్పులతో నూతనంగా చెక్కించి పునర్ప్రతిష్ఠ చేయడానికి పూజలు చేశారు. దేవాలయ మెట్ల నుంచి గర్భాలయం, నాట్యమంటపం చుట్టూ ఈ క్యూలైన్లను ఏర్పాటు చేశారు.
ఆలయ (Temple) ప్రాంగణంలో గార్డెన్ ఏర్పాటుకు కాంట్రాక్టర్ శ్రీనివాస్‌తో కలిసి సూపరింటెండెంట్ భూమిపూజ చేశారు. కల్యాణమంటపంలో వర్షం కురిస్తే నీరు కురవకుండా ఉండటానికి రూ. 30 లక్షలతో కల్యాణమంటపంపై భాగం పనులు జరుగుతున్నాయని సూపరింటెండెంట్ నిహీల్‌దాస్ అన్నారు. నంది మంటపం నూతనంగా నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధమైనట్లు, దేవాలయ ప్రాంగణంలో రాష్ట్ర టూరిజం శాఖ గతంలో సౌండ్ అండ్ లైటింగ్‌కు కొనోగులు చేసిన భూమిని రాష్ట్ర టూరిజం శాఖ డైరెక్టర్ వాణిదేవితో సంప్రదింపులు జరిగాయని, ఎన్వోసీ తీసుకొని ఆ ప్రాంతంలో బాత్రూంలు, టాయిలెట్స్నిర్మిస్తామని ఆయన తెలిపారు. కేంద్ర పురావస్తుశాఖ మంత్రిని గత నెలలో కలిసి రూ.14.14 కోట్లు ప్రతిపాదనలు ముందుపెట్టగా రూ.10 కోట్లు ముందుగా ఇచ్చారని, అవి రాగానే దేవాలయం చుట్టూ తవ్వకాలు చేపట్టి చుట్టూ ఉన్న 3 లేయర్లను పైకి తీస్తామని చెప్పారు. ఆయన వెంట ఇంటాక్ కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారావు, కేంద్ర పురావస్తుశాఖ జిల్లా అధికారి అజిత్, సీఐ వంశీకృష్ణ, ప్రదీప్ ఉన్నారు.