రామగిరి, జూలై 31 : ప్రతి విద్యార్థి పుస్తక పఠనం అలవర్చుకోవాలని, పుస్తకమే హస్తభూషణమని, విద్యార్థి చేతికి పుస్తకమే సౌందర్యమని, అలాంటి పుస్తకాలతో విద్యార్థులు స్నేహం చేయాలని జడ్పీహెచ్ఎస్ కేశరాజుపల్లి హెచ్ఎం నలపరాజు జయరాములు అన్నారు. కవి, రచయిత పెరుమాళ్ల ఆనంద్, తాను రాసిన పుస్తకాలను అలాగే వట్టిమర్తి విద్యార్థులు రాసిన యాత్రా స్మృతులు పుస్తకం, రెక్క విప్పిన బాల్యం పుస్తకం, కథల పుస్తకం, జర్నీ, మరికొన్ని విలువైన సాహిత్య గ్రంథాలను పాఠశాల గ్రంథాలయానికి బహుకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేటి యువత సెల్ ఫోన్లకు, టీవీలకు బానిసయ్యారని, విద్యార్థులు, యువత సత్ప్రవర్తనతో, సన్మార్గంలో వెళ్లాలంటే పుస్తక పఠన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. పుస్తకాలను చదివి విద్యార్థులు సమీక్షా వ్యాసాలు రాయడం అలవర్చుకోవాలని, అలాగే ప్రతి విద్యార్థి వ్యక్తిగత గ్రంథాలయం ఏర్పాటు చేసుకోవాలని అందులో జీవిత చరిత్రలు, శతకాలు ఇతర సబ్జెక్టు పుస్తకాలు కూడా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు జి.సులోచన, సతీష్ కుమార్, ఎం.నాగరాజు, శ్రీనివాస రెడ్డి, సౌజన్య, ఉమామహేశ్వరి, సంధ్యారాణి, పి.విజయ్, విద్యార్థులు పాల్గొన్నారు.