Dowry Harassment | ఇంట్లో అందరూ ఉపయోగించే టాయిలెట్.. కానీ ఆ యువతికి మాత్రం తాళం వేసేశారు. కారణం.. పుట్టింటి నుంచి రూ.50 వేలు వరకట్నం తీసుకురావాలని! కట్నం డబ్బులు తెచ్చిన తర్వాతే తాళం తీస్తామని అత్తింటివారు చెప్పడంతో.. చివరకు ఆ కొత్త కోడలు టాయిలెట్ కోసం పొరుగింటి తలుపు తట్టాల్సి వచ్చింది. ఉత్తరప్రదేశ్లోని భదోహిలో వెలుగుచూసిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
భదోహిలోని రోషన్తారా ప్రాంతానికి చెందిన షబ్నమ్ (20) తన అత్తింటివారిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. సెప్టెంబరు మొదటి వారంలో తన తండ్రి నుంచి రూ.50 వేలు తీసుకురావాలని అత్తింటివారు డిమాండ్ చేశారని.. తాను నిరాకరించడంతో వేధింపులు మొదలయ్యాయని ఆమె ఆరోపించింది.
బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. సెప్టెంబరు 27 ఉదయం టాయిలెట్ ఉపయోగించేందుకు వెళ్లిన షబ్నమ్కు తలుపు తాళం వేసి కనిపించింది. బాత్రూం తలుపులు తెరవాలని అత్తింటివారిని అడిగితే పట్టించుకోలేదు. దీంతో తానే డోర్ తీసేందుకు ప్రయత్నించగా.. మామ బునియాద్తో పాటు ఇతర కుటుంబ సభ్యులు ఆమెపై దాడి చేశారు. రూ.50 వేలు వరకట్నం డబ్బులు తీసుకొస్తేనే టాయిలెట్ ఉపయోగించుకోవాలని హుకుం జారీ చేశారు. ఇక చేసేదేమీ లేక ఆమె పొరుగింటికి వెళ్లి ఆమె టాయిలెట్ ఉపయోగించుకుంది. అనంతరం ఈ వేధింపులపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఇంట్లోని ఇతర కుటుంబ సభ్యులు ఉపయోగించాల్సి వచ్చినప్పుడు మాత్రం తాళం తీసి.. వారు వెళ్లొచ్చిన తర్వాత మళ్లీ తాళం వేసేవారని షబ్నమ్ తెలిపింది. తన భర్త ఇంతియాజ్ టాయిలెట్ తాళం తీయించేందుకు ప్రయత్నించినప్పటికీ.. తండ్రి, అన్నలకు భయపడి ఏమీ చేయలేకపోయాడని పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు మామ బునియాద్, బావమరుదులు ఇలియాస్, నన్హ్కు, ఆడపడుచులు సనా, రెహానాలపై సిటీ కొత్వాలి పోలీసులు కేసు నమోదు చేశారు. బీఎన్ఎస్ 85, 115(2), 351(3) సెక్షన్లతో పాటు వరకట్న నిషేధ చట్టంలోని 3, 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఎస్పీ అభినవ్ త్యాగి తెలిపారు.