Sigma | సందీప్ కిషన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘సిగ్మా’ విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబర్ 2న తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా విడుదలకు కొన్ని గంటల ముందు.. హీరో సందీప్ కిషన్ సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తనను, తన కొత్త సినిమాను లక్ష్యంగా చేసుకుని కొంతమంది ఉద్దేశపూర్వకంగా ప్రతికూల ప్రచారం చేస్తున్నారని సందీప్ కిషన్ ఆరోపించారు. ఈ ప్రచారం వెనుక ఎవరున్నారో, ఇందుకోసం ఎవరు డబ్బులు ఖర్చు చేస్తున్నారో తనకు తెలుసంటూ ఆయన పేర్కొన్నారు. ఇదే విధంగా కొనసాగితే పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తూ ఘాటుగా స్పందించారు.
సందీప్ కిషన్ తన సోషల్ మీడియా పోస్టులో.. గత కొన్ని రోజులుగా తనను, తన కొత్త సినిమాను లక్ష్యంగా చేసుకుని ఉద్దేశపూర్వకంగా పోస్టులు, వ్యాఖ్యలు చేస్తున్నవారిని గమనిస్తున్నానని పేర్కొన్నారు. ఈ ప్రచారం వెనుక ఉన్న వ్యక్తులు ఎవరో తనకు తెలుసని, దీనికోసం డబ్బులు ఖర్చు చేస్తున్నది ఎవరో కూడా తెలుసని అన్నారు.తన కంటే ఇలాంటి ప్రచారం చేస్తున్నవారే ఎక్కువగా నష్టపోతారని వ్యాఖ్యానించిన సందీప్ కిషన్.. పరిస్థితి ఇలాగే కొనసాగితే అసలు విషయాలు బయటకు వస్తాయని, అప్పుడు సంబంధం ఉన్నవారంతా బయటపడతారని హెచ్చరించారు. సందీప్ కిషన్ చేసిన పోస్టుపై సంగీత దర్శకుడు థమన్ కూడా స్పందించారు. ‘మామా సందీప్.. చిల్ మామా.. రేపు సిగ్మాలో రచ్చ లేపు’ అంటూ ఆయన ధైర్యం చెప్పారు. దీనికి సంబంధించిన మీమ్‌ను కూడా జత చేశారు. దీనికి సందీప్ కిషన్ స్పందిస్తూ.. ‘బేబీ రేపు అదే జరగబోతోంది’ అంటూ బదులిచ్చారు.
ఇదిలా ఉండగా.. హైదరాబాద్‌లో ‘సిగ్మా’కు సరైన థియేటర్లు, అనుకూలమైన ప్రదర్శన సమయాలు దక్కలేదంటూ ఓ నెటిజన్ చేసిన వ్యాఖ్యకు కూడా సందీప్ కిషన్ స్పందించారు. ఇది తనకు ఒక దశాబ్దంలోనే అత్యంత బలహీనమైన విడుదల అని ఆయన వ్యాఖ్యానించారు. సినిమా ప్రేక్షకులకు నచ్చితే చాలని, అసలు విషయం వారికి అర్థమవుతుందని పేర్కొన్నారు. ‘సిగ్మా’ సినిమాతో తమిళనాడు సీఎం విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సందీప్ కిషన్ సరసన ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటించింది. రాజు సుందరం, సంపత్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎస్. థమన్ సంగీతం అందించారు. తెలుగులో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ లిమిటెడ్, ఎన్.వి.ఆర్ సినిమా సంస్థలు ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాయి.