Shamshabad Airport | హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి కడప వెళ్తున్న ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడు హల్చల్ సృష్టించాడు. విమానం టేకాఫ్ కోసం రన్‌వేపైకి వెళ్తున్న సమయంలో ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు ప్రయత్నించాడు. ఇది గమనించిన క్యాబిన్ సిబ్బంది వెంటనే అతడిని అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పింది.
ప్రయాణికుడి హల్చల్తో విమానంలో ఉన్న ఇతర ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. సిబ్బంది సకాలంలో స్పందించడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. అనంతరం సదరు ప్రయాణికుడిని విమానం నుంచి దించి పోలీసులకు అప్పగించారు.
ఘటనపై ఆర్జీఐఏ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు ఎందుకు ప్రయత్నించాడనే విషయంపై విచారణ చేపట్టారు. అతడు మద్యం మత్తులో ఉన్నాడా? లేక ఇతర కారణాలతో అలా చేశాడా? అనే కోణాల్లోనూ వివరాలు సేకరిస్తున్నారు. ఘటనకు అసలు కారణం దర్యాప్తులో తేలాల్సి ఉంది.