Tahir Hussain : ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) అధికారి అంకిత్ శర్మ హత్య కేసులో ఢిల్లీ కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ నేత తాహిర్ హుస్సేన్‌తోపాటు మరో నలుగురికి కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఢిల్లీ, కార్కర్డూమా కోర్టు శుక్రవారం ఈ తీర్పు వెల్లడించింది. ఈ కేసులో తాహిర్ హుస్సేన్, నజీమ్, కాసిం, జావెద్, అనాస్‌లను నిందితులుగా ఈ నెల 13న కోర్టు గుర్తించింది. అయితే, నిందితులకు మరణ శిక్ష విధించాలని ఢిల్లీ పోలీసులు కోర్టును కోరారు. ఈ కేసును అత్యంత అరుదైన కేసుగా పరిగణించాలిన కోర్టుకు విజ్ఞప్తి చేశారు. కానీ, కోర్టు చివరక యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.
2020, ఫిబ్రవరి 25న సాయంత్రం ఐబీ అధికారి అంకిత్ శర్మ నిత్యావసర సరుకులు కొనేందుకు తన ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. అయితే, తాహిర్ హుస్సేన్, ఇతర నిందితులు కలిసి అంకిత్ శర్మను కిడ్నాప్ చేశారు. అనంతరం అతడిని దారుణంగా హత్య చేశారు. ఈ సమయంలో ఢిల్లీలో ఘర్షణలు జరిగాయి. కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఘర్షణలు కొన్నిచోట్ల మత ఘర్షణలుగా కూడా మారాయి. ఈ మతం అనే కోణంలోనే అంకిత్ శర్మను కిడ్నాప్ చేసి, హత్య చేశారు. ఈ హత్య అనంతరం అతడి మృతదేహాన్ని నిందితులు ఈడ్చుకెళ్లారు. శరీరా భాగాల్ని కొన్నిచోట్ల కోసేశారు. ముఖంపై యాసిడ్ పోసి కాల్చేశారు. అతడిని గుర్తు పట్టకుండా చేయాలనుకున్నారు. అనంతరం దగ్గర్లోని ఒక డ్రైన్లో అతడి మృతదేహాన్ని పడేసి వెళ్లిపోయారు. ఆలోపు అంకిత్ శర్మ కుటుంబ సభ్యులు అతడి కోసం గాలించారు. అతడు కనిపించకపోవడంతో మరుసటి రోజు మిస్సింగ్ కేసు నమోదు చేశారు.
ఇక, అతడి మృతదేహాన్ని గుర్తించిన తర్వాత పోలీసులు ఈ కేసును చాలా సీరియస్‌గా తీసుకున్నారు. ఈ ఘటనపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ హత్యను వ్యతిరేకిస్తూ చాలా ఆందోళనలు జరిగాయి. ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఢిల్లీ పోలీసులు వేగంగా విచారణ జరిపారు. నిందితులు తాహిర్ హుస్సేన్, నజీమ్, కాసిం, జావెద్, అనాస్‌లను అరెస్టు చేశారు. వీరిపై హత్య అభియోగాలు మోపారు. ఏ కారణం లేకుండా కేవలం మతం అనే కోణంలోనే ఈ హత్యకు పాల్పడ్డట్లు పోలీసులు ఆరోపించారు. గతంలో నిందితులకు, అంకిత్ శర్మకు ఎలాంటి విబేధాలు కూడా లేవు. చివరకు పోలీసుల వాదనలు విన్న కోర్టు ఈ ఘటనను అత్యంత తీవ్రమైన నేరంగా పరిగణించింది. మతం వల్లే అత్యంత దారుణంగా నిందితులు ఈ హత్యకు పాల్పడ్డారని వ్యాఖ్యానించింది. తాజాగా నిందితులకు యావజ్జీవ కారాగార శిక్షను ఖరారు చేసింది.