– కుంగిన అప్రోచ్‌కు లక్షలు వెచ్చించి మరమ్మతులు
– పెరుగుతున్న గోదావరితో పొంచిఉన్న ప్రమాదం
బూర్గంపహాడ్, జూలై 31 : పాత వంతెన శిథిలావస్థకు చేరడంతో పదికాలాల పాటు ఉండాలన్న లక్ష్యంతో సారపాక- భద్రాచలం మధ్యలో కోట్లాది రూపాయలతో నిర్మించిన కొత్త వారధికి మరోసారి ప్రమాదం పొంచి ఉంది. ఇటీవల భద్రాచలం-సారపాక వారధి ప్రారంభంలో రోడ్డుకు అప్రోచ్ కుంగిపోవడంతో మరమ్మతులు అయితే చేపట్టారు. 80 రోజులుగా అప్రోచ్ పనులు నిర్విరామంగా జరిగాయి. అప్రోచ్ మరమ్మతుల విషయంలో నాణ్యతా ప్రమాణాలు పాటించలేదని జూన్ 10న ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక కథనం కూడా ప్రచురించింది. ఇంతవరకు బాగానే ఉన్నా తాజాగా ఎగువన కురుస్తున్న వర్షాలు, ప్రాజెక్టుల నుంచి వరదనీరు తాలిపేరు ప్రాజెక్టు ద్వారా భద్రాచలం వద్ద గోదావరి నదిలోకి భారీగా వచ్చి చేరుతుండటంతో పెరుగుతున్న వరదతో కోట్లాది రూపాయలతో వెచ్చించి నిర్మించిన కుంగిన అప్రోచ్‌కు మరోసారి ముప్పు వాటిల్లనుందా అనేది ప్రశ్నార్ధకంగా మారింది.
దీంతో కొత్త వారధికి ప్రమాదం పొంచి ఉందనే ఆరోపణలు సైతం వినవస్తున్నాయి. పాత వారధికి సమన్వయంగా కొత్త వారధి మధ్య రిటైనింగ్ వాల్ నిర్మించకపోవడంతోనే అప్రోచ్ కుంగిపోయిందని సంబంధిత అధికారులు సైతం గుర్తించినా ఈ విషయంలో నిర్మాణ సంస్థపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తాజాగా భద్రాచలం వద్ద 48 అడుగుల వద్ద గోదావరి వరద ప్రవహిస్తుండటంతో అధికారులు రెండవ ప్రమాద హెచ్చరికను సైతం జారీచేశారు. పెరిగిన వరద కారణంగా ఇప్పటికే నిర్మించిన అప్రోచ్ కుంగిపోతే కోట్లాది రూపాయలు మళ్లీ నీటిపాలయ్యే అవకాశం లేకపోలేదనే వాదనలూ లేకపోలేదు.
భద్రాచలం గోదావరిపై ప్రస్తుతం ఉన్న పాత వంతెనను 1965 లో ముంబైకి చెందిన పటేల్ ఇంజనీరింగ్ కంపెనీ నిర్మించగా అప్పటి నుంచి ఇప్పటివరకు 76 అడుగులకు పైగా వరద వచ్చినా ఎలాంటి చెక్కు చెదరలేదు. నూతన వారధిని ఆధునిక సాంకేతికతో నిర్మించి రెండు సంవత్సరాలు పూర్తికాకుండానే అప్రోచ్ కుంగిపోవడం, బ్రిడ్జి నాణ్యతలో లోపాలు బయటపడటంపై సర్వత్రా చర్చించుకుంటున్నారు. ఈ తరుణంలో వరద ప్రభావం మరింత పెరిగితే కుంగిపోయిన అప్రోచు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని…. మరమ్మతు పనులకు ఇప్పటివరకు ఖర్చుచేసిన కోట్లాది రూపాయలు నీటి పాలు కాక తప్పదనే అనుమానం ప్రజలు, భక్తుల్లోనూ వ్యక్తమవుతోంది.

భద్రాద్రి ‘కొత్త వారధి’కి ముప్పు తప్పదా ?