Executions : దేశానికి సంబంధించిన రహస్య సమాచారాన్ని ఇజ్రాయెల్ (Israel) కు చేరవేస్తున్నారనే ఆరోపణలతో ఇరాన్ (Iran) వరుస ఉరిశిక్షలు అమలు చేస్తోంది. గూఢచర్యం ఆరోపణలతో ఇరాన్ సోమవారం మరో వ్యక్తిని ఉరితీసి చంపింది. ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ సర్వీస్ అయిన ‘మొస్సాద్ (Mossad)’ కు కీలక సమాచారం అందించాడని మొహమ్మద్ అమీన్ అనే వ్యక్తిని ఉరికంబం ఎక్కించింది.
ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించిన తర్వాత ఇలా గూఢచర్యం ఆరోపణలతో మొత్తం ముగ్గురిని ఉరితీశారు. సోమవారం మొహమ్మద్ అమీన్‌ను ఉరితీయగా.. గత వారం మాజిద్ మోసయేబి, ఇస్మాయిల్ ఫక్రీ అనే వ్యక్తులను కూడా ఇరాన్ ఉరితీసింది. కాగా ఈ ఉరిశిక్షలపై ప్రపంచ మానవ హక్కుల సంఘాలు, పలు సంస్థలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. ఇరాన్ న్యాయ ప్రక్రియలో పారదర్శకతను ప్రశ్నిస్తూ తీవ్ర విమర్శలు చేస్తున్నాయి.
ఎలాంటి ఆధారాలు చూపకుండా, బహిరంగ విచారణలు చేపట్టకుండా పౌరులకు ఉరిశిక్షలు అమలు చేస్తున్నారని మండిపడుతున్నాయి. ఇదిలావుంటే ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు ఇప్పుడు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇరాన్‌లోని బాలిస్టిక్ క్షిపణి స్థావరాలను ఇజ్రాయెల్ తాజాగా ధ్వంసం చేసింది. మరోవైపు ఇరాన్ కూడా క్షిపణులతో ఇజ్రాయెల్‌పై విరుచుకుపడింది.