Engineer missing : ఇజ్రాయెల్-ఇరాన్ (Israel vs Iran) యుద్ధం కారణంగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నానాటికి పెరుగుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్లో పరిస్థితులు భయానకంగా ఉన్నాయి. ఈ ఉద్రిక్తతల వేళ భారత్‌కు చెందిన ఓ ఇంజినీర్ ఇరాన్ (Iran) లో అదృశ్యమయ్యారు. దాంతో తమకు సాయం చేయాలని అతడి కుటుంబం కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించింది.
బీహార్‌లోని సివాన్ ప్రాంతానికి చెందిన 25 ఏళ్ల సిరాజ్ అలీ అన్సారీ ఓ ప్రైవేటు కంపెనీలో క్వాలిటీ కంట్రోల్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం అతడితోపాటు మరో 30-35 మందిని సదరు కంపెనీ నెల రోజుల వర్క్ వీసాపై ఇరాన్‌లోని అరాక్ ప్రాంతంలో ఓ ప్లాంట్ నిర్మాణం కోసం పంపింది. సిరాజ్ జూన్ 9న సౌదీ అరేబియా మీదుగా ఇరాన్ చేరుకున్నాడు. ఆ తర్వాత కొన్ని రోజులకే ఇరాన్‌పై ఇజ్రాయెల్ ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ పేరుతో దాడులు చేపట్టింది.
అరాక్ ప్రాంతంలోనూ ఇజ్రాయెల్ క్షిపణి దాడులు చేసింది. దాంతో సిరాజ్‌తోపాటు మిగతావారిని ఓ రిఫైనరీ ప్లాంట్ టౌన్‌షిప్‌కు తరలించారు. ఆ తర్వాత నుంచి తమ కుమారుడి ఆచూకీ తెలియరావడం లేదని సిరాజ్ తండ్రి హజ్రత్ అలీ ఆవేదన వ్యక్తం చేశారు. జూన్ 17న అతడితో చివరిసారిగా మాట్లాడానని, ఆ తర్వాత నుంచి ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తోందని తెలిపారు. తాను ఉంటున్న ప్రాంతానికి కేవలం కిలోమీటర్ దూరంలోనే పేలుడు సంభవించినట్లు సిరాజ్ తమతో చివరిసారిగా చెప్పినట్లు వెల్లడించారు.
తమ కుమారుడి ఆచూకీ గుర్తించి క్షేమంగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు సాయం చేయాలని కేంద్ర విదేశాంగ శాఖను సిరాజ్ తండ్రి అభ్యర్థించారు. కాగా ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంతో పశ్చిమాసియా రగులుతున్న నేపథ్యంలో.. ఇరాన్లో చిక్కుకున్న భారతీయుల కోసం భారత్ ‘ఆపరేషన్ సింధు’ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా భారత్ 1,713 మందిని తీసుకొచ్చింది. చివరగా ఆదివారం సాయంత్రం 285 మందిని చేర్చింది.