Tej Pratap Yadav : ఆర్జేడీ చీఫ్ (RJD chief), బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ (Tejpratap Yadav) ను ఇటీవల పార్టీ నుంచి, కుటుంబం నుంచి బహిష్కరించారు. క్రమశిక్షణా రాహిత్యంతో పార్టీకి, కుటుంబానికి చెడ్డపేరు తెస్తున్నారనే ఆరోపణలతో ఆయనపై బహిష్కరణ వేటు వేశారు.
దీనిపై తాజాగా తేజ్ ప్రతాప్ యాదవ్ స్పందించారు. తాను భయపడే రకం కాదని, పరిస్థితులకు ఎదురు నిలిచి పోరాడుతానని చెప్పారు. తనపై బహిష్కరణ వేటు పడటానికి పార్టీలోని నలుగురైదుగురు వ్యక్తులే కారణమని, వాళ్ల పేర్లు సమయం వచ్చినప్పుడు బయటపెడుతానని అన్నారు. బీహార్ ప్రజలకు తన స్వభావం గురించి తెలుసని, నలుగురైదుగురు వ్యక్తుల కారణంగా తనను పార్టీ నుంచి ఎలా బహిష్కరించారో వారంతా చూశారని చెప్పారు.
నా స్వభావాన్ని ఆసరాగా చేసుకున్న కొందరు నాపై బురదజల్లి పార్టీ నుంచి బహిష్కరించేలా చేశారని తేజ్‌ప్రతాప్ ఆరోపించారు. న్యాయం కోసం తాను ప్రజల మధ్యకే వెళ్తానని అన్నారు. వ్యక్తిగత జీవితంలో జోక్యం చేసుకోవడాన్ని ఎవరూ సహించరని వ్యాఖ్యానించారు. నాకు ప్రాణహాని ఉన్నదని, ప్రభుత్వం తనకు భద్రత పెంచాలని కోరుతూ కోర్టుకు వెళ్తానని తెలిపారు. నాపై బహిష్కరణ వేటుకు కారణమైన ఆ నలుగురైదుగురు వ్యక్తులను మాత్రం విడిచిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు.
ఇంత జరిగినా తాను ఆ నలుగురైదుగురి పేర్లను మాత్రం బయటపెట్టలేదని, తన తల్లిదండ్రులను తాను గౌరవిస్తున్నానని తేజ్ ప్రతాప్ చెప్పారు. ఒక అన్నగా తేజస్వి యాదవ్‌కు తన ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని అన్నారు. తేజస్వి ముఖ్యమంత్రి కావడానికి అన్ని విధాలుగా తన సహకారం ఉంటుందని చెప్పారు.