Vitamin C Fruits | మనిషి శరీరానికి విటమిన్ సి చాలా అవసరం. శరీరంలో రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో, కొల్లాజెన్ ఉత్పత్తిని చేయడంలో, శరీరం ఐరన్ ను గ్రహించేలా చేయడంలో విటమిన్ సి కీలక పాత్ర పోషిస్తుంది. విటమిన్ సి శరీరంలో నిల్వ ఉండదు. దీనిని రోజూ ఆహారంలో భాగంగా తీసుకోవాల్సిందే. ఇక విటమిన్ సి ఎక్కువగా ఉండే పండ్ల విషయానికి వస్తే బ్లూబెర్రీల పేరు ఎక్కువగా వినబడుతూ ఉంటుంది. బ్లూబెర్రీలను విటమిన్ సి కి శక్తివంతమైన వనరుగా పేర్కొంటారు. ఒక కప్పు బ్లూబెర్రీలు 14.4 మిల్లీగ్రాముల విటమిన్ సి ని అందిస్తాయి. బ్లూబెర్రీలల్లో విటమిస్ సి ఎక్కువగా ఉన్నప్పటికీ ఇవి ధరతో కూడుకున్నవి. అలాగే ఇవి అన్ని చోట్ల లభించవు. కనుక అందరూ వీటిని తినలేరు. బ్లూబెర్రీల కంటే విటమిన్ సి ఎక్కువగా ఇతర పండ్లు కూడా లభిస్తాయి. అలాగే ఇవి అందరికీ అందుబాటు ధరల్లో లభిస్తాయని చెప్పవచ్చు. విటమిన్ సి ఎక్కువగా ఉండే ఇతర పండ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పైనాపిల్ పండ్లల్లో కూడా విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఒక కప్పు పైనాపిల్ 109.5 మిల్లీగ్రాముల విటమిన్ సి ని అందిస్తుంది. సలాడ్ రూపంలో లేదా తాజా జ్యూస్ రూపంలో పైనాపిల్ ను తీసుకోవడం వల్ల తగినంత విటమిన్ సి లభిస్తుంది. అరటిపండ్లు కూడా అధిక మొత్తంలో విటమిన్ సి ని కలిగి ఉంటాయి. ఒక కప్పు అరటిపండు ముక్కల్లో 102. 5 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది. అరటిపండ్లను నేరుగా తీసుకోవడం , సలాడ్ రూపంలో లేదా స్మూతీ, షేక్స్ రూపంలో తీసుకోవడం ద్వారా తగిన మొత్తంలో శరీరానికి విటమిన్ సి లభిస్తుంది. అదే విధంగా ఒక కప్పు నారింజ ముక్కలు 97.5 మిల్లీగ్రాముల విటమిన్ సి ని అందిస్తాయి. వీటిని నేరుగా లేదా జ్యూస్ రూపంలో తీసుకోవడం ద్వారా తగినంత విటమిన్ సి ను పొందవచ్చు. ఇక ఒక కప్పు జామ ముక్కల్లో అత్యధికంగా 376. 7 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది. జామకాయలు అందరికీ అందుబాటు ధరల్లో సులభంగా లభ్యమవుతాయి. వీటిని ముక్కల రూపంలో నేరుగా తీసుకోవడం లేదా స్మూతీ రూపంలో తీసుకోవడం వల్ల తగినంత విటమిన్ సి ని పొందవచ్చు.
బొప్పాయి పండ్లు కూడా విటమిన్ సి ని కలిగి ఉంటాయి. ఒక కప్పు బొప్పాయి ముక్కల్లో 88.3 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది. సలాడ్ రూపంలో లేదా ఇతర ఆహారాలతో కలిపి స్మూతీ రూపంలో దీనిని తీసుకోవచ్చు. అలాగే మామిడికాయల్లో కూడా విటమిన్ సి ఉంటుంది. ఒక కప్పు మామిడి ముక్కల్లో 60.1 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది. వీటిని నేరుగా తినడం ద్వారా లేదా ఆమ్ పన్నా వంటివి చేసి తీసుకోవడం వల్ల తగినంత విటమిన్ సి ని పొందవచ్చు. ఈ పండ్లన్నీ కూడా అందరికీ అందుబాటు ధరల్లో సులభంగా లభిస్తాయి. అలాగే బ్లూబెర్రీల కంటే అధిక మొత్తంలో విటమిన్ సి కలిగి ఉంటాయి. బ్లూబెర్రీలను తీసుకోలేని వారు ఈ పండ్లను తీసుకోవడం ద్వారా శరీర రోజూ వారి అవసరాలకు సరిపడే విటమిన్ సి లభిస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.