Execution : ఓ బాలిక (Girl) పై అత్యాచారానికి పాల్పడి, అనంతరం హత్య చేసిన వ్యక్తిని ఇరాన్ (Iran) లో బహిరంగంగా ఉరితీశారు. ఆ కేసులో నిందితుడు దోషిగా తేలడంతో ఈ ఏడాది మార్చిలో అతడికి న్యాయస్థానం బహరంగ మరణశిక్ష (Public execution) విధించింది. తాజాగా శనివారం ఆ శిక్షను అమలు చేశారు. ఇరాన్ మీడియా సంస్థలు ఈ విషయాన్ని వెల్లడించాయి.
ఇరాన్ మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం.. బుకాన్కు చెందిన ఓ బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై ఆమెను హత్య చేశాడు. విచారణలో అతడు దోషిగా తేలాడు. దాంతో అతడికి బహిరంగంగా మరణశిక్ష విధించాలని బాధిత కుటుంబసభ్యులు, ప్రజల నుంచి డిమాండ్లు వచ్చాయి. ఈ క్రమంలో మార్చిలో కోర్టు అతడికి మరణశిక్ష ఖరారు చేసింది. సుప్రీంకోర్టు కూడా ఆ శిక్షను సమర్థించింది.
భావోద్వేగాలతో ముడిపడిన కేసు కాబట్టి కఠినశిక్షపై నిర్ణయం తీసుకున్నామని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. బాధిత కుటుంబసభ్యుల కోరిక మేరకు శిక్షను విధిస్తున్నట్లు పేర్కొంటూ తాజాగా దాన్ని అమలు చేశారు. అయితే ఇరాన్లో బహిరంగంగా మరణశిక్షలు విధించడం సాధారణమే. హత్య, అత్యాచారం లాంటి తీవ్రమైన కేసుల్లో ఇలాంటి కఠినమైన శిక్షలను అమలుచేస్తారు.
కాగా మానవ హక్కుల సంస్థల డాటా ప్రకారం.. ప్రపంచంలో ఎక్కువ మరణశిక్షలు అమలుచేసే దేశాల్లో ఇరాన్ రెండో స్థానంలో ఉంది. మొదటి స్థానంలో చైనా ఉంది.