Kangana Ranaut : పాలిటిక్స్ (Poitics) చాలా ఖరీదైనవని, నిజాయితీగా పనిచేసే ఎంపీలకు జీతం సరిపోదని ప్రముఖ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ (Kangana Ranaut) వ్యాఖ్యానించారు. సిబ్బందికి జీతాలుపోను ఎంపీలకు మిగిలేది అంతంత మాత్రమేనని చెప్పారు. ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కంగన ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రజాప్రతినిధులు, పీఏలతో తమ నియోజకవర్గాలకు వాహనాల్లో వెళ్లేందుకు రూ.లక్షల్లో ఖర్చవుతున్నదని కంగనా రనౌత్ తెలిపారు. నియోజకవర్గంలోని ఒక్కో ప్రదేశం 300-400 కిలోమీటర్ల దూరంలో ఉండటమే అందుకు కారణమన్నారు. అందుకే రాజకీయాలు ఖర్చుతో కూడుకున్నవని ఆమె అభిప్రాయపడ్డారు. ఎంపీలకు వచ్చే జీతం సరిపోవట్లేదని, అందుకే మరో ఉద్యోగం చేసుకోవాల్సి వస్తోందని చెప్పారు. ఇప్పటికే చాలామంది ఎంపీలకు వ్యాపారాలు ఉన్నాయని, మరికొందరు న్యాయవాదులుగా ఉన్నారని ఆమె తెలిపారు.
ఎంపీగా ఉంటే మరో ఉద్యోగం అవసరం కాబట్టి ఆ పదవిని వృత్తిగా తీసుకోలేమని కంగన అన్నారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురించి కూడా ఆమె మాట్లాడారు. భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలను తానే తగ్గించానని ట్రంప్ చెప్పుకుంటున్నారని, గతంలో ట్రంప్‌కు తాను మద్దతుదారునని, కానీ ఇప్పుడు ఆయన తీరు తనకు నచ్చడం లేదని చెప్పారు. అమెరికా విషయంలో కూడా ఆయన తప్పులు చేస్తున్నారని తనకు అనిపిస్తోందన్నారు.
ఇదిలావుంటే తాను రాజకీయ జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించలేకపోతున్నానని ఇటీవల కంగనా చెప్పారు. ప్రజలు తన వద్దకు పంచాయతీ స్థాయి సమస్యలను కూడా తీసుకొస్తున్నారని, ‘మీ సొంత డబ్బును ఉపయోగించి సమస్యను పరిష్కరించండి’ అని అంటున్నారని ఆమె అసహనం వ్యక్తంచేశారు. ప్రధాని కావాలన్న లక్ష్యం ఉందా అని మీడియా ప్రశ్నించగా.. అందుకు తాను సమర్థురాలిని కాదన్నారు. ఆ కోరిక తనకు లేదని, దేవుడు తనను ప్రధానిని చేయడని వ్యాఖ్యానించారు.