నిజం చెప్పాలంటే కవి నిరంతరం ప్రవహించే ఒక నది లాంటివాడు. ఆయన కుదురుగా ఒకచోట ఉండడు. ఆయన ఉన్నా ఆయన మనస్సు ఉండదు. ఉన్నచోటు నుండే ప్రపంచాన్ని చుట్టి రాగలిగే శక్తి ఒక కవికి మాత్రమే ఉంది. అందుకే రవి గాంచని చోటు కవి గాంచుతాడని మన పెద్దవాళ్లు ఎప్పుడో చెప్పారు. ఈ మాటలు అక్షరాల మడిపల్లి భద్రయ్యకు వర్తిస్తాయి.
మడిపల్లి భద్రయ్య 1945 జనవరి 17న నిర్మల్ పట్టణంలో వీరయ్య, గంగమ్మ దంపతులకు జన్మించారు. బీఏ తెలుగు పట్టభద్రుడై తెలుగు భాషోపాధ్యాయునిగా ఉద్యోగ బాధ్యతను నిర్వర్తించారు. తెలుగు, సంస్కృతం, ఉర్దూ భాషల్లో చక్కని పాండిత్యం కలిగిన భద్రయ్య చిన్నప్పుడే కవితా రచన మొదలుపెట్టారు. అతని తండ్రి వీరయ్య చక్కని కవి. తండ్రి వద్ద అనేక కావ్యాలు, వ్యాకరణ, అలంకార, కావ్య శాస్ర్తాలను ఆయన అధ్యయనం చేశారు. ఒగ్గు కథలు, ఏకపాత్రలు, నాటికలు, పాటలు, తెలంగాణ ఉద్యమ గీతాలు, గేయకావ్యాలు, వచన కవితలు, శతకాలు, పద్యాలు రాశారు. ఎన్నో సాహిత్య, సాంస్కృతిక, సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఆయన చురుకుగా పాల్గొనేవారు.
భద్రయ్యది మధురమైన కంఠస్వరం. ఒగ్గు కథలు రాసి స్వయంగా గానం చేస్తుంటే శ్రోతలు ముగ్ధులై వినేవారు. తెలంగాణ తొలి దశ ఉద్యమంలోనే కాదు, మలిదశ ఉద్యమంలో కూడా కీలకమైన పాత్రను పోషించారు. తెలంగాణ ఉద్యమ గీతాలను రాసి, స్వయంగా పాడుతూ, ఆడుతుంటే అందరూ ఆయనతోపాటు గొంతు కలిపి ఆడేవారు. పాటలతో ఆయన అందరినీ ఉర్రూతలూగించేవారు. ఆయన స్వస్థలం నిర్మల్ అయినప్పటికీ వృత్తిరీత్యా ఆదిలాబాద్ పరిసర ప్రాంతాల్లో పనిచేసి ఆదిలాబాద్ జిల్లాతో విడదీయరాని అనుబంధాన్ని పెంచుకున్నారు. అందుకే…
‘ఆదిలాబాదు జిల్లా జిల్లా
అడవుల తల్లి జిల్లా జిల్లా
జిల్లా అంటే జిల్లా కాదు
ఆదిలాబాదు జిల్లా జిల్లా’
అంటూ ఆదిలాబాదు జిల్లా గొప్పతనాన్ని చాటి చెప్పే గీతాన్ని రాసి, ఎన్నో సభల్లో గానం చేసి అందరినీ పరవశింపజేశారు.
తెలుగు భాషోపాధ్యాయునిగా ఉద్యోగంలో ప్రవేశించి, గజిటెడ్ ప్రధానోపాధ్యాయుడిగా పదవీ విరమణ పొందిన తర్వాత 60 ఏండ్ల వయస్సులో కూడా ఆదిలాబాద్ జిల్లాలోని 52 మండలాల్లో తన ద్విచక్ర వాహనంపై పర్యటించి, ఆయా ప్రాంతాల సాహితీ సాంస్కృతిక విశేషాలన్నింటినీ వివరిస్తూ ‘మన ఆదిలాబాదు‘ అనే పుస్తకాన్ని రాశారు. అంతేకాకుండా సుమారు పది వేల పదాలతో ‘మన భాష-మన యాస‘ పేరుతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజల వ్యావహారిక పదకోశాన్ని తయారుచేశారు. భద్రయ్య తాను పనిచేసిన ప్రతిచోట ఒక సాహిత్య సంస్థను ఏర్పాటు చేసి సాహితీ, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఎందరో విద్యార్థులను కవులుగా, కళాకారులుగా తీర్చిదిద్దారు. ‘ప్రత్యూష’ అనే సాహిత్య మాసపత్రికను చాలా ఏండ్లు స్వయంగా నడిపారు. ఆ రోజుల్లో ఇది ఎంతోమంది సాహిత్యాభిమానులకు కరదీపికలా ఉండేది.
‘పగయు పెరిగెనేని పాడౌను దేశంబు
వగపె మిగులు చూడు వసుధలోన
తగదు నగును జగము తథ్యంబు గనుమిది
పొగలు చిమ్ము కర్ర పొయ్యి చేటు’
ఆయన శాంతిని కోరుకునే మనస్తత్వం కలిగినవారు. పగలు, ప్రతీకారాలు వద్దు అని ఈ పద్యంలో చక్కగా వ్యక్తీకరించారు. ‘యాదగిరి లక్ష్మీనరసింహ శతకం’, ‘శ్రీనివాస శతకం’, ‘బతుకు బాట శతకం’, ‘మనోవేదన సప్తశతి’, ‘షిరిడీసాయి త్రిశతి’, ‘మనోవిలాసం’, ‘జ్ఞాన సరస్వతీ స్తవం’, ‘నాలోని నాదాలు’ వంటి 25 పుస్తకాలు రచించారు. తెలుగు విశ్వవిద్యాలయం వారి నండూరి రామకృష్ణమాచార్య స్మారక పురస్కారం, శాతవాహన విశ్వవిద్యాలయం వారి ముదిగంటి వెంకట నరసింహారెడ్డి సాహితీ పురస్కారం, అప్పటి రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ నుంచి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం, గౌరవ సత్కారాలు అందుకున్న భద్రయ్య 2021 సెప్టెంబర్ 18న పరమపదించినప్పటికీ తెలుగు సాహితీ లోకంలో చిరంజీవియై వెలుగొందుతూనే ఉంటారు. నిర్మల్ నుంచి మంచిర్యాలకు వెళ్లే ప్రధాన రహదారిలో భద్ర య్య విగ్రహాన్ని ఆయన అభిమానులు ప్రతిష్ఠించారు. ఇది ఆయన మీద వారికున్న ఆరాధనాభావానికి నిదర్శనం.
– తిరునగరి శ్రీనివాసస్వామి 9440369939