KTR | భారత రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కుటుంబ సమేతంగా మలేషియా రాజధాని కౌలాలంపూర్ చేరుకున్నారు. మలేషియా తెలంగాణ అసోసియేషన్ (మైటా), బీఆర్ఎస్ మలేషియా శాఖల సంయుక్త ఆధ్వర్యంలో జూన్ 6వ తేదీన కౌలాలంపూర్ లో నిర్వహించనున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో పాల్గొనేందుకు కేటీఆర్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఇక్కడికి విచ్చేశారు.
కౌలాలంపూర్ విమానాశ్రయానికి చేరుకున్న కేటీఆర్ దంపతులకు వారి కుటుంబ సభ్యులకు ప్రవాస తెలంగాణ ప్రతినిధులు, బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. స్వాగతం పలికిన వారిలో తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు గాదరి కిశోర్ కుమార్, మైటా అధ్యక్షుడు తిరుపతి, బీఆర్ఎస్ మలేషియా అధ్యక్షుడు మారుతితో పాటు ఇతర ముఖ్య నేతలు, ఎన్నారైలు ఉన్నారు.
కేటీఆర్ రాకతో మలేషియాలోని ప్రవాస తెలంగాణ సమాజంలో సరికొత్త ఉత్సాహం నెలకొంది. రేపు జరగబోయే ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు, విజయవంతం చేసేందుకు మైటా, బీఆర్ఎస్ మలేషియా కమిటీలు ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేశాయి.