హైదరాబాద్ : భగత్‌సింగ్ యువసేన రాష్ట్ర అద్యక్షుడు లడ్డు యాదవ్ ఆధ్వర్యంలో శనివారం భారీ తిరంగా బైక్ ర్యాలీ ( Tiranga Bike Rally ) ని నగరంలో నిర్వహించారు. ఈ ర్యాలీలో ప్రముఖ బాలివుడ్ నటులు సోను సూద్ ( Sonu Sood ) పాల్గొన్నారు. బేగంబజార్ ఛత్రి చౌరస్తాలో ఏర్పాటు చేసిన స్వాగత వేదికపై సోను సూద్ మాట్లాడారు.
బేగంబజార్‌తో తనకు ఎంతో అనుబంధం ఉందని పేర్కొన్నారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండేలా అవగాహన కల్పించాలని కోరారు. అవసరమైతే ఆదుకునేందుకు తాను సిద్దమని స్పష్టం చేశారు. లడ్డు యాదవ్ ఆధ్వర్యంలో తిరంగా బైక్‌ర్యాలీ నిర్వహించడం, భారీ సంఖ్యలో యువత తరలి రావడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా పలువురు వికలాంగులకు వీల్ చైర్లు, అనాథ విద్యార్థులకు పాఠశాల బ్యాగులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పవన్‌సింగ్, అజయ్ అగర్వాల్, రోమల్ సింగ్, దినేష్ యాదవ్, గురుసింది తదితరులు పాల్గొన్నారు.