– సాగర్ ఎడమ కాల్వ అడుగు లోతు నీళ్లలో గణనాథుల నిమజ్జనం
– ప్రభుత్వ చర్యలపై ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యేల తీవ్ర విమర్శలు
నల్లగొండ, సెప్టెంబర్ 23 : అందరు కొలిచే దేవుడు గణనాథుడి నిమజ్జనం పట్ల జిల్లా మంత్రులు, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎమ్మెల్సీ ఎంసీ కోటి రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, నల్లమోతు భాస్కరరావు తీవ్రంగా ఖండించారు. బుధవారం వేములపల్లి సాగర్ ఎడమకాల్వ వద్ద గణేష్ నిమజ్జన ఏర్పాట్లను వారు పరిశీలించారు. అడుగు లోతు నీళ్లలోనే కొంతమంది వినాయకులను నిమజ్జనం చేయడం చూసి నివ్వెరపోయారు. దేవుడి నిమజ్జనానికి నీళ్లు లేకుండా చేసి తీవ్ర అపచారం చేసిన మంత్రులు, అధికారుల తీరును వారు తీవ్రంగా నిరసించారు.

‘అందరూ కొలిచే దేవుడి పట్ల మంత్రుల నిర్లక్ష్యం’
భక్తుల నమ్మకాలను వమ్ము చేసేలా గణేష్ నిమజ్జన ఏర్పాట్లు ఉన్నాయని తీవ్రంగా విమర్శించారు. వేములపల్లి వద్ద అన్ని ఏర్పాట్లు చేశామని, ఎటువంటి ఇబ్బంది ఉండదని అధికారులు చెప్తే నమ్మామన్నారు. తీరా ఇక్కడికి వచ్చి చూస్తే సాయంత్రం 7 గంటల వరకు సైతం అడుగు లోతు నీళ్లు మాత్రమే రావడం ప్రభుత్వ నిర్లక్ష్యం వైఖరికి నిదర్శనమని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, తిప్పర్తి, మర్లపల్లి మండల పార్టీ అధ్యక్షుడు పల్ రెడ్డి రవీందర్ రెడ్డి, బాపయ్య, రావుల శ్రీనివాస రెడ్డి, రాపోలు వెంకటేశ్వర్లు, అశోక్ రెడ్డి, స్థానిక బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

‘అందరూ కొలిచే దేవుడి పట్ల మంత్రుల నిర్లక్ష్యం’