IIM Calcutta : పశ్చిమబెంగాల్ (West Bengal) రాజధాని కోల్‌కతా (Kolkata) లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (IIM) విద్యార్థినిపై అత్యాచారం జరిగిన ఘటన ఆ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రాష్ట్రంలో మహిళలపై వరుస అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నా వాటిని అరికట్టడంలో మమత సర్కారు విఫలమైందని ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పించాయి. ఈ క్రమంలో బాధితురాలి తండ్రి చేసిన ప్రకటన ఆశ్చర్యం కలిగిస్తోంది. తన కుమార్తెపై ఎలాంటి అత్యాచారం జరగలేదని, ఆమె ఆటోలో నుంచి జారిపడి స్పృహ తప్పిందని ఆయన ప్రకటించారు.
శనివారం సాయంత్రం విద్యార్థిని తండ్రి మీడియాతో మాట్లాడుతూ.. ‘మీ కుమార్తె ఆటోలో నుంచి కిందపడి స్పృహ కోల్పోయింది. ఆమెను పోలీసులు రక్షించి SSKM ఆస్పత్రి న్యూరాలజీ డిపార్టుమెంటులో చేర్పించారు’ అని శుక్రవారం రాత్రి 9.34 గంటలకు తనకు ఓ వ్యక్తి నుంచి ఫోన్ వచ్చిందని ఆయన తెలిపారు. తనపై ఎలాంటి లైంగిక దాడి జరగలేదని తన కుమార్తె తనకు చెప్పిందని అన్నారు. ఇప్పుడు నా కుమార్తె నాకు దక్కిందని, ఆమె ఆరోగ్య పరిస్థితి సాధారణంగా ఉందని చెప్పారు.
పోలీసులు అరెస్ట్ చేసిన వ్యక్తితో తన కుమార్తెకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. ప్రస్తుతం ఆమె నిద్ర పోతోందని, ఆమెతో ఎక్కువగా మాట్లాడలేకపోయానని చెప్పారు. ఆమె నిద్రలేచిన తర్వాత పూర్తి వివరాలు అడిగి తెలుసుకుంటానన్నారు. కాగా, శుక్రవారం పోలీసులు ఆస్పత్రికి తీసుకెళ్లిన తర్వాత స్పృహలోకి వచ్చిన బాధితురాలు తనపై అత్యాచారం జరిగిందని చెప్పారు. సాటి విద్యార్థి తనను కౌన్సెలింగ్ పేరుతో ఆస్పత్రికి పిలిపించి, కూల్ డ్రింక్‌లో డ్రగ్స్ కలిపి ఇచ్చాడని, ఆ డ్రింక్ తాగగానే తాను స్పృహ కోల్పోయానని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఆ తర్వాత స్పృహలోకి వచ్చిన తాను తనపై అత్యాచారం జరిగిన విషయాన్ని గ్రహించానని వెల్లడించారు. దీనిపై నిందితుడిని నిలదీయడంతో విషయం బయటపెడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని తనను బెదిరించాడని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఆమె తండ్రి అందుకు పూర్తిగా విరుద్ధమైన ప్రకటన చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కాగా శుక్రవారం బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. అతడికి కోర్టు ఈ నెల 19 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఈ క్రమంలో బాలిక తండ్రి తాజాగా ఈ ప్రకటన చేశారు.