Road accident : ఓ స్కార్పియో (Scarpio) వాహనం అదుపుతప్పి డివైడర్ను ఢీకొన్నది. మితిమీరిన వేగం కారణంగా డివైడర్ పైనుంచి ఎగిరి అవతలి లేన్లోకి వెళ్లింది. ఆ లేన్ ఎదురుగా వస్తున్న ట్రక్కు (Truck) ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. పశ్చిమ బెంగాల్ (West Bengal) రాష్ట్రంలోని పశ్చిమ మిడ్నాపూర్ (West Midnapur) జిల్లాలో శనివారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది.
పశ్చిమబెంగాల్ రాష్ట్రం వెస్ట్బుర్డ్మాన్లోని అసన్సోల్ పట్టణ వాసులైన నలుగురు వ్యక్తులు ఒడిశాలోని బాలేశ్వర్కు స్కార్పియో వాహనంలో బయలుదేరారు. ఉదయం 6 గంటల సమయంలో వారి వాహనం పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలోని బెల్దా పరిధిలోగల రాణిసరాయ్ గ్రామానికి చేరుకోగానే 16వ నెంబర్ జాతీయ రహదారిపై అదుపుతప్పింది.
డివైడర్ను ఢీకొని అవతలి లేన్లోకి ఎగిరిపడింది. అవతలి లేన్లో టమాటా లోడుతో ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టింది. దాంతో స్కార్పియో కారు మొత్తం నుజ్జునుజ్జయ్యింది. అందులో ఉన్న నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.