తంగళ్లపల్లి, ఫిబ్రవరి 27 : అధికారిక కార్యక్రమమని తెలిసి కూడా వేదికపైకి తమనెందుకు పిలువడం లేదని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు గగ్గోలు పెడుతూ హల్చల్ చేశారు. తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి గ్రామంలోని ఓ ఫంక్షన్‌హాలులో శుక్రవారం మండలంలోని 30 గ్రామాలకు చెందిన 160 మందికి కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం తహసీల్దార్ ప్రకాశ్‌రావు అధ్యక్షతన ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్య అతిథిగా ఏఎంసీ చైర్పర్సన్ వెల్ముల స్వరూపరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, ఆర్డీవో వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు చెక్కులు అందించే సమయంలో ముఖ్య అతిథితో కలిసి కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు చెక్కులు పంపిణీ చేస్తామని హల్చల్ చేయడంతో అంకిరెడ్డిపల్లె సర్పంచ్ రాజిరెడ్డితోపాటు పలువురు సర్పంచులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో అధికారులతో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. వేదికపైకి తమను ఎందుకు పిలువరంటూ గగ్గోలు పెట్టారు. దీంతో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ రసాభాసగా మారింది. అతిథులు విస్మయం వ్యక్తం చేస్తూ ఇరు వర్గాలను సముదాయించి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ముగించారు. కల్యాణలక్ష్మి చెక్కుల లబ్ధిదారులకు రెవెన్యూ స్టాంపులు తెచ్చుకోవాలనే సమాచారం ముందస్తుగా ఇవ్వకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. దీంతో రెవెన్యూ స్టాంపుల కోసం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇటు కాంగ్రెస్ నేతల హల్చల్.. అధికారుల వైఫల్యంతో చెక్కుల పంపిణీ కార్యక్రమం పూర్తి గందరగోళంగా ముగిసింది. ఈ కార్యక్రమాల్లో మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు పుర్మాణి రాజశేఖర్‌రెడ్డి, సర్పంచులు గుండు ప్రేమ్‌కుమార్, సిలివేరి లావణ్య, గాదగోని సాగర్, మోర లక్ష్మీరాజం, రెవెన్యూ అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.