Laxma Reddy | ఇరిగేషన్ రంగంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. ఆంధ్రా పాలకుల కుట్రతో మహబూబ్‌నగర్ జిల్లా ఎంతో నష్టపోయిందని తెలిపారు. నీళ్ల కోసమే ఉద్యమాలు జరిపి కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారని పేర్కొన్నారు. అధికారంలోకి రాగానే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభించామని చెప్పారు.
పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తయితే జిల్లా సస్యశ్యామలం అవుతుందని లక్ష్మారెడ్డి అన్నారు. మిగిలిన 10 శాతం పనులు పూర్తి చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. ఎగువన కర్ణాటక రాష్ట్రంఅక్రమ ప్రాజెక్టులు కడుతోందని అన్నారు. గేట్ల లీకుల ద్వారా వచ్చిన నీళ్లతోనే లక్ష ఎకరాలకు నీళ్లందేవని తెలిపారు. ఇప్పుడు కర్ణాటక హైడ్రాలిక్ గేట్లు పెట్టి నీటిని వదలడం లేదని చెప్పారు. మహబూబ్‌నగర్‌కు అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత సీఎం రేవంత్ రెడ్డిదే అని స్పష్టం చేశారు. వెంటనే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
మహబూబ్‌నగర్ జిల్లా కోసం ఎంత దూరమైనా వెళ్తామని స్పష్టం చేశారు. కర్ణాటక ప్రాజెక్టులు పూర్తయితే మహబూబ్‌నగర్ జిల్లాకు కరువు వస్తుందని అన్నారు. కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంతో రిజర్వాయర్లు నింపడం లేదని తెలిపారు. కాంగ్రెస్ నాయకులకు ప్రాజెక్టులపై అవగాహన లేదని విమర్శించారు. ఎల్‌నినోతో తీవ్ర కరువు వచ్చే పరిస్థితి ఉందని చెప్పారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం మేల్కొని నీటి హక్కులను కాపాడాలని సూచించారు.