Man Shot Wife, 2 Priests | భార్య, పూజారులపై కాల్పులు జరిపి హత్య.. పిల్లలను నిర్బంధించిన ఆ వ్యక్తి ఎన్కౌంటర్లో మృతి
Man Shot Wife, 2 Priests | మానసిక పరిస్థితి సరిగా లేని వ్యక్తి తన క్షేమం కోసం కుటుంబం పూజా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంపై ఆగ్రహించాడు. భార్య, ఇద్దరు పూజారులపై గన్తో కాల్పులు జరిపి హత్య చేశాడు. ముగ్గురు పిల్లలను గదిలో నిర్బంధించాడు. పోలీసుల ఎన్కౌంటర్లో అతడు మరణించాడు. ఆ వ్యక్తి జరిపిన కాల్పుల్లో గాయపడిన కుమారుడు కూడా చనిపోయాడు.
లక్నో: మానసిక పరిస్థితి సరిగా లేని వ్యక్తి తన క్షేమం కోసం కుటుంబం పూజా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంపై ఆగ్రహించాడు. భార్య, ఇద్దరు పూజారులపై గన్తో కాల్పులు జరిపి హత్య చేశాడు. ముగ్గురు పిల్లలను గదిలో నిర్బంధించాడు. బలవంతంగా లోపలకు ప్రవేశించిన పోలీసుల ఎన్కౌంటర్లో అతడు మరణించాడు. ఆ వ్యక్తి జరిపిన కాల్పుల్లో గాయపడిన కుమారుడు కూడా చనిపోయాడు. (Man Shot Wife, 2 Priests) ఉత్తరప్రదేశ్లోని అజంగఢ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శంభూపూర్ గ్రామానికి చెందిన అరవింద్ సింగ్ అనే వ్యక్తి కొంతకాలంగా మానసిక దుర్భలంతో బాధపడుతున్నాడు. దూకుడు స్వభావం ఉన్న అతడు తరచుగా తన కుటుంబ సభ్యులపై దాడి చేసేవాడు.
కాగా, అరవింద్ సింగ్ మానసిక పరిస్థితి గురించి అతడి కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. దుష్టశక్తి ప్రభావం అతడిపై ఉన్నట్లు అనుమానించారు. ఆ దుష్టశక్తిని పారద్రోలేందుకు, అతడి ప్రవర్తనలో మార్పు కోసం అరవింద్ తల్లి, భార్య కలిసి మంగళవారం తమ ఇంట్లో ఒక పూజా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఐదుగురు పూజారులతో కలిసి పూజా కార్యక్రమంలో వారు పాల్గొన్నారు.
మరోవైపు మంగళవారం సాయంత్రం 6 గంటల సమయంలో అరవింద్ సింగ్ తన ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ పూజా కార్యక్రమాన్ని అతడు వ్యతిరేకించాడు. తీవ్ర ఆగ్రహానికి గురైన అతడు పూజారులను తిట్టాడు. అయితే పూజారులను భర్త అవమానించడాన్ని 32 ఏళ్ల భార్య బబితా సింగ్ నిలదీసింది. దీంతో ఆగ్రహానికి గురైన అతడు తన భార్య, ఇద్దరు పూజారులైన 60 ఏళ్ల మహేంద్ర పాఠక్, 50 ఏళ్ల అఖిలేష్ మిశ్రాపై లైసెన్స్ ఉన్న తుపాకీతో కాల్చి చంపాడు. ఇది చూసి మిగతా ముగ్గురు పూజారులు భయంతో అక్కడి నుంచి పారిపోయారు. ఆ తర్వాత అరవింద్ సింగ్ తన ముగ్గురు పిల్లలను ఒక గదిలోకి తీసుకెళ్లి బంధించాడు.

Priests
కాగా, ఒక వ్యక్తి కాల్పుల్లో ఒక మహిళ, ఇద్దరు పూజారులు మరణించినట్లు తెలుసుకున్న పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. పిల్లలతో కలిసి గదిలో బంధీగా ఉన్న అరవింద్ను బయటకు రావాలని కోరాగా అతడు నిరాకరించాడు. దీంతో బుధవారం ఉదయం వరకు వేచి చూడాలని పోలీసులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో సుమారు 7 గంటల వరకు ప్రతిష్టంభన కొనసాగింది.
అయితే బుధవారం తెల్లవారుజామున గది లోపలి నుంచి అరవింద్ కాల్పులు జరుపడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు బలవంతంగా లోపలకు ప్రవేశించారు. ఈ సందర్భంగా జరిగిన ఎన్కౌంటర్లో అరవింద్ మరణించాడు. ముగ్గురు పిల్లలను పోలీసులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే తండ్రి కాల్పుల్లో బుల్లెట్ గాయమైన కుమారుడైన బాలుడు చికిత్స పొందుతూ మరణించినట్లు పోలీస్ అధికారి తెలిపారు. కుమార్తెలైన ఇద్దరు బాలికలు తీవ్ర మానసిక ఆందోళనలో ఉన్నట్లు చెప్పారు.
ఎన్కౌంటర్ సమయంలో అరవింద్ తన పెద్ద కుమార్తెను రక్షణ కవచంలా వాడుకున్నాడని పోలీస్ అధికారి ఆరోపించారు. అతడి కాల్పుల్లో మరణించిన భార్య, ఇద్దరు పూజారుల మృతదేహాలను పోస్ట్మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

