దేవరకొండ రూరల్, సెప్టెంబర్ 23 : అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య చేసుకున్న దుర్ఘటన దేవరకొండ రూరల్ మండలం ముదిగొండ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ముంత చిన్నయ్య అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య ముంత అలివేలు తెలిపిన వివరాల ప్రకారం.. తన భర్త చిన్నయ్య ముదిగొండ గ్రామంలో 8 ఎకరాల వ్యవసాయ భూమిలో ఆరు ఎకరాలలో ప్రతి పంట సాగు చేస్తున్నాడు. అయితే సకాలంలో వర్షాలు పడకపోవడంతో పంట దిగుబడి ఆశించినంత స్థాయిలో లేకపోవడంతో అప్పు ఎలా తీర్చాలని మనస్థాపానికి గురయ్యాడు. దీంతో మంగళవారం పొలంలోని తుమ్మ చెట్టుకు తన పంచెను గొంతుకు ఉరి వేసుకుని చనిపోయినట్లు పక్క పొలం రైతు తోట నిరంజన్ ఇచ్చిన సమాచారం మేరకు అక్కడికి వెళ్లి చూడగా చిన్నయ్య అప్పటికే చనిపోయినట్లు అలివేలు తెలిపింది. వీరికి ఇద్దరు అబ్బాయిలు, ఒక కూతురు ఉన్నారు. అలివేలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.