Anna Hazare : కేంద్ర విద్యాశాఖ మాజీ మంత్రి (Union Education Ex Minister) ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) రాజీనామాపై సామాజిక కార్యకర్త అన్నాహజారే (Anna Hazare) స్పందించారు. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో సమస్యలను పరిష్కరించడానికి చర్చలు మాత్రమే సరైన మార్గమని పేర్కొన్నారు. ఉద్రిక్తతలు సృష్టించడంతో, నియంతృత్వ ధోరణితో ఏమీ సాధించలేమని అన్నారు. ఇప్పటివరకు తాను 22 సార్లు నిరాహార దీక్ష చేశానని, ఎన్నడూ హింసను ఆశ్రయించలేదని అన్నారు. శాంతియుత ఆందోళనలే శాసనపరమైన మార్పులు తీసుకురావడానికి దోహదపడ్డాయన్నారు.
తాను చేపట్టిన శాంతియుత నిరసనల కారణంగా 10 చట్టాలు అమల్లోకి వచ్చినట్లు వెల్లడించారు. ప్రభుత్వాలు పౌరుల మాట వినాలని, ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలని హజారే సూచించారు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం రెండు అడుగులు ముందుకు వేయాల్సి వచ్చినా అందులో ఏ తప్పూ ఉండబోదని పేర్కొన్నారు. మన నిర్ణయాలు ప్రజాప్రయోజనాలకు అనుగుణంగా ఉండటమే ముఖ్యమన్నారు. మంత్రుల రాజీనామా వంటి డిమాండ్లను సైతం శాంతియుత పద్ధతిలో సాధించుకోవాలని తెలిపారు.
హింసాత్మక నిరసనల కంటే శాంతియుత నిరసనలు, చర్చలే ప్రజల్లో పాలనలో మార్పు తీసుకువస్తాయన్నారు. ఎంతటి పరిస్థితులు ఎదురైనా హింసను మాత్రం ఆశ్రయించొద్దని ప్రజలకు, ప్రభుత్వానికి సూచించారు.