BRS Australia | మెల్బోర్న్: కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారం, అసత్య ఆరోపణలు, కుట్రలను జాతీయ స్థాయిలో బహిర్గతం చేస్తూ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) కి ఈమెయిల్ ద్వారా తన అభిప్రాయాలను తెలియజేసిన బీఆర్ఎస్ ఆస్ట్రేలియా సభ్యుడు తీర్థల లక్ష్మీనరసింహ గుప్తాను బీఆర్ఎస్ ఆస్ట్రేలియా నాయకుడు కాసర్ల నాగేందర్ రెడ్డి మెల్బోర్న్లో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా కాసర్ల నాగేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్ఆర్ఐలంటే కేవలం విదేశాల్లో నివసించే వారే కాదు, తమ పుట్టిన గడ్డపై అపారమైన ప్రేమ, బాధ్యత కలిగిన వారు కూడా అని తీర్థల లక్ష్మీనరసింహ గుప్తా రాజు మరోసారి నిరూపించారని.. తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, నిజాలను ప్రజల ముందుకు తీసుకురావాలనే తపనతో ఆయన చేసిన కృషి ప్రశంసనీయం. మా తోటి బీఆర్ఎస్ ఆస్ట్రేలియా సభ్యుడిగా మాకు ఇది ఎంతో గర్వకారణం అని, అలాగే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న అవినీతి, అరాచక పాలనను ఎండగడుతూ, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమవుతున్న విషయాలను ప్రజలకు వివరించే కార్యక్రమాన్ని బీఆర్ఎస్ ఆస్ట్రేలియా నిరంతరం కొనసాగిస్తుందని తెలిపారు. రానున్న ఎన్నికల వరకు ఈ పోరాటం ఆగదని, తెలంగాణలో బీఆర్ఎస్ మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని నాగేందర్ రెడ్డి స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా తీర్థల లక్ష్మీనరసింహ గుప్తా రాజు మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టుపై జరుగుతున్న కుట్రలను, అసత్య ప్రచారాన్ని మరియు నిరాధార ఆరోపణలను ప్రజల ముందుకు తీసుకురావడం నా ప్రథమ లక్ష్యం. అందుకే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి ఈమెయిల్ ద్వారా వాస్తవాలను తెలియజేయడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా వాటిని ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వానికి, సంబంధిత అధికార సంస్థలకు తెలియజేస్తూ ప్రజల ముందు నిజాలను ఉంచేందుకు నా పోరాటం కొనసాగుతుందని అన్నారు.
ఈ సన్మాన కార్యక్రమం, మీడియా సమావేశంలో బీఆర్ఎస్ ఆస్ట్రేలియా ముఖ్య నాయకులు సాయిరామ్ ఉప్పు, విశ్వామిత్ర మంత్రిప్రగడ, సూర్యారావు కాచారపు , ఉమాపతి రావు, శ్రవణ్ గుప్తా, సాయి తదితరులు పాల్గొన్నారు.