సువాసనలు మనసుకు ఉత్తేజాన్ని కలిగిస్తాయని తెలిసిందే. అయితే గులాబీ పూల మరిమళం మహిళల్లో మరింత ప్రత్యేకంగా పనిచేస్తుందట. క్రమబద్ధంగా వాడితే ఆడవాళ్ల మెదడుపై గులాబీ అత్తరు సానుకూల ప్రభావాన్ని చూపిస్తుందని ఇటీవలి ఓ అధ్యయనం చెబుతున్నది. జపాన్‌లోని క్యోటో, సుకుబా విశ్వవిద్యాలయాలు సంయుక్తంగా మహిళల మీద నెల రోజుల పాటు ఈ ప్రయోగాలు చేశాయి. అందులో భాగంగా కొందరు స్త్రీలని రెండు బృందాలుగా విభజించారు.
ఒక బృందాన్ని వరుసగా నెల రోజుల పాటు రోజ్ ఎసెన్షియల్ ఆయిల్‌ను దుస్తుల మీద రాసుకోమని అడిగారు. మిగతా బృందానికి సాధారణ నీటిని ఇచ్చారు. ఈ ప్రయోగానికి ముందు తర్వాత వీళ్లందరి మెదడును ఎంఆర్ఐ స్కాన్ చేశారు. ఇందులో గులాబీ అత్తరు పూసుకున్న వాళ్ల మెదడులో గ్రే మ్యాటర్ వృద్ధి చెందినట్టు స్పష్టమైంది. సమాచారాన్ని ప్రాసెస్ చేసేందుకు, కదలికల్ని నియంత్రించేందుకు, అప్రమత్తత, ఆలోచనల నిర్వహణ, జ్ఞాపక శక్తి, భావోద్వేగాల అదుపు… లాంటి రకరకాల పనులు గ్రే మ్యాటర్ ద్వారానే జరుగుతాయి.
సమస్యల్ని పరిష్కరించడం, కొత్త విషయాలు నేర్చుకోవడంలాంటి నైపుణ్యాలన్నీ దీని అధీనంలోనే ఉంటాయి. మెదడులో ప్రధాన భాగంగా పిలిచే అమిగ్దలా గ్రే మ్యాటర్‌తోనే ఏర్పడుతుంది. ఈ ప్రయోగం తర్వాత ప్రధానంగా జ్ఞాపక శక్తి, భావోద్వేగాల నియంత్రణకు సంబంధించిన భాగాల్లో మరిన్ని మార్పులు వచ్చాయట. కాబట్టి గులాబీ పరిమళం మనసుకి ఆహ్లాదాన్నివ్వడమే కాదు…
మెదడునూ ఉత్తేజితం చేస్తుందన్న మాట!