Radhika Yadav : టెన్నిస్ ప్లేయర్ (Tennis player) రాధికా యాదవ్ (Radhika Yadav) ను హత్య చేసిన కేసులో ఆమె తండ్రి దీపక్ యాదవ్ (Deepak Yadav) కు గురుగ్రామ్ కోర్టు (Gurugram Court) 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ (Judicial custody) విధించింది. దాంతో గురుగ్రామ్ పోలీసులు దీపక్ యాదవ్‌ను కోర్టు నుంచి జైలుకు తరలించారు.
టెన్నిస్ క్రీడాకారిణి అయిన రాధికా యాదవ్‌ను గత గురువారం ఉదయం ఆమె తండ్రే హత్య చేశాడు. గురుగ్రామ్‌లోని వారి నివాసంలోనే ఆమె ప్రాణం తీశాడు. కిచెన్‌లో వంట పని చేస్తున్న రాధికా యాదవ్ వెనుక నుంచి వెళ్లి తన లైసెన్స్డ్ రివాల్వర్‌తో కాల్పులు జరిపాడు. నాలుగు రౌండ్ల బుల్లెట్లు ఒంట్లోంచి దూసుకెళ్లడంతో రాధిక అక్కడికక్కడే కుప్పకూలి మరణించారు.
రాధికా యాదవ్ సొంతంగా టెన్నిస్ అకాడమీ నడుపుతుండటంతో ఇరుగుపొరుగు తనను కుమార్తె సంపాదనతో బతుకుతున్నావని హేళన చేస్తున్నారని, దాంతో అకాడమీని మూసివేయమని ఎంత చెప్పినా తన కుమార్తె వినిపించుకోలేదని, అందుకే ఆమెను హత్య చేశానని పోలీసుల విచారణలో దీపక్ యాదవ్ తెలిపాడు. ఇదిలావుంటే రాధిక ఇన్‌స్టాలో పెట్టిన ఓ రీల్ కూడా హత్యకు కారణమని తెలుస్తోంది.