మూసీ నది మెల్లగా ప్రవహిస్తోంది
నిర్ణయాల వేగం మాత్రం
ప్రజల ఊపిరిని మించి దూసుకెళ్తోంది..
మట్టి గుండెల్లో చరిత్ర నిద్రిస్తుంటే..
కాంక్రీట్ గోపురాల్లో ప్రాధాన్యతలు మేల్కొంటున్నాయి.
ప్రజల పన్నులతో విగ్రహాల కలలు కడుతున్న పాలన!
గాంధీ పేరు చెబుతూ ఆయన మార్గం మరిచిపోతే అది శిల్పమా?
మహాత్మాగాంధీ నడిచింది సత్యం మీద
సాదాసీదా జీవితం మీద…గ్రామాల శ్వాస మీద
కానీ ఆయన పేరుతో వేల కోట్లు గాల్లో విసురుతున్న వైనం!
మూసీ ఒడ్డున మట్టి వాసన మాయమై
కాంక్రీట్ కలలే పరిమళిస్తున్న కాలం
ఖజానా ఖాళీ అంటూనే ప్రజల పన్నులతో
శిల్పాల శిఖరాలు కట్టే పాలన!
గాంధీ పేరు నోటిలో..ఆయన మార్గం మట్టిలో..
అది గౌరవమా? లేదా ప్రదర్శన రాజకీయమా?
మూసీ తీరంలో విగ్రహం ఎత్తు ఆకాశాన్ని తాకినా
కూల్చేసిన ఇండ్లు…కుటుంబాల నిట్టూర్పుల ఎత్తును
ఎవరైనా కొలుస్తారా?
వేల గుండెల్లో భయం గూడు కట్టుకుంటే..
అది అభివృద్ధి కాదు..అవస్థల శిలాఫలకం!
నోటిఫికేషన్ కాగితాలు ఇంకుతో కాదు..
జీవితాలతో రాస్తున్న కథలు
ఇల్లు కోల్పోయిన ప్రతి కుటుంబం
ప్రణాళికల అంచున
చరిత్రగా మారుతున్న గాయాలు!
గాంధీని శిలలో నిలబెట్టడం కంటే
ఆయన ఆలోచనలను విధానాల్లో నిలబెట్టడం ఆత్మగౌరవం
మూసీ ఒడ్డున నిలిచేది ఒక విగ్రహమే కాదు..
ప్రాధాన్యతల రాజకీయానికి
ప్రజాస్వరం వేసిన నిశ్శబ్ద ప్రశ్నార్థక చిహ్నం!
– కొలిపాక శ్రీనివాస్
98665 14972