Iran-US : అమెరికా, ఇజ్రాయెల్‌లకు ఇరాన్ భారీ హెచ్చరిక జారీ చేసింది. ఎట్టి పరిస్థితుల్లో యుద్ధాన్ని ఆపేది లేదని స్పష్టం చేసింది. అమెరికా బెదిరింపులకు లొంగబోమని తెలిపింది. యుద్ధం ముగింపుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రకరకాల ప్రకటనలు చేస్తున్న వేళ ఇరాన్ చేసిన ప్రకటన సంచలనం సృష్టిస్తోంది. ఈ మేరకు ఇండియాలోని ఇరాన్ ఎంబసీ తన సోషల్ మీడియా వేదికగా ఈ ప్రకటన చేసింది.
‘‘మేం అమెరికా బాంబుల కారణంగా రాతియుగంలోకి వెళ్లడం లేదు. మాకు 7,000 ఏళ్ల నాగరిక చరిత్ర ఉంది. చరిత్రకు ఈ విషయం తెలుసు. అమాయకులైన పిల్లల్ని చంపి, అమానవీయ నేరాలు చేస్తున్న మీరు రాతియుగాన్ని ఆధునిక ప్రపంచంలోకి తెచ్చారు అనేది స్పష్టం’’ అని తన ట్వీట్లో పేర్కొంది. ఇరాన్‌తో యుద్ధంపై బుధవారం రాత్రి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. తాము ఇరాన్‌పై చేస్తున్న యుద్ధం కారణంగా ఆ దేశం రాతియుగంలోకి వెళ్తుందన్నారు. ఇరాన్ సైన్యం, నేవీ పూర్తిగా బలహీనపడిపోయాయని చెప్పారు. యుద్ధాన్ని రెండు, మూడు వారాల్లో ముగిస్తామన్నారు. అయితే, ఇరాన్ మిలిటరీ మాత్రం ట్రంప్ ప్రకటనకు ధీటుగా స్పందించింది. అమెరికాకు తీవ్ర అవమానం జరిగే వరకు యుద్ధాన్ని వదలేది లేదని, అమెరికా పశ్చాత్తాప పడి, లొంగిపోయే వరకు తమ దాడులు కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఇరాన్ మిలిటరీకి నష్టం జరిగిందన్న అమెరికా ఆరోపణల్ని కూడా ఆ దేశం ఖండించింది.
అమెరికా తమను తక్కువగా అంచనా వేసిందని అభిప్రాయపడింది. ఇరాన్ సైనిక ప్రతినిధి ఒకరు ఈ వ్యాఖ్యలు చేశారు. తమ దేశం దగ్గరున్న సైనిక శక్తి, మిస్సైళ్ల తయారీ గురించి అమెరికా ఇంటెలిజెన్స్‌కు సరిగ్గా తెలియదన్నారు. లాంగ్ రేంజ్ అటాక్ మిస్సైల్స్ డ్రోన్లు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్, స్పెషలైజ్డ్ ఎక్విప్మెంట్ వంటివి తమ దేశం దగ్గరున్నాయని ఇరాన్ ప్రతినిధి మీడియాతో తెలిపారు.