నిజామాబాద్, ఆగస్టు 14, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ గొప్పలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు విని నిరుద్యోగులు ఇప్పుడు విలవిల్లాడుతున్నారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి మాటలు విని నమ్మి మోస పోయామంటూ లబోదిబో మంటున్నారు. కేసీఆర్ పాలనలో వేలాది ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. టీజీపీఎస్సీ, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా అనేక ఉద్యోగాలు భర్తీ అయ్యాయి. ఎంతో మందికి పారదర్శకంగా ఉద్యోగాలు దక్కాయి. పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన ఎంతో మంది ఉద్యోగాల్లో చేరి విధులు నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు గుప్పించి నిరుద్యోగులను కాంగ్రెస్ పార్టీ రెచ్చగొట్టింది.
2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆంధ్రా మీడియాను అడ్డం పెట్టి అసత్య ప్రచారాలకు తెర లేపింది. కుట్రలు, కుతంత్రాలతో పాటుగా గత సర్కారుపై లేనిపోని అపవాదులు అంటగట్టి యువతను వ్యతిరేకంగా మార్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏడాదిలో 2లక్షల ఉద్యోగాలిస్తామంటూ నమ్మబలికి ఓట్లను కొల్లగొట్టారు. దాదాపుగా 31 నెలలు దాటుతోన్న ఉద్యోగ నోటిఫికేషన్లకు దిక్కూ దివానా లేకుండా పోయింది. నిరుద్యోగులు ఉద్యమ బాట పట్టడంతో వందల ఖాళీలు ఉన్న చోట కేవలం అరకొర పోస్టులతో నోటిఫికేషన్లు ఇచ్చి మమ అనిపించే ప్రయత్నం జరుగుతోంది. మొక్కుబడిగా ఏదో చేస్తున్నట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం బిల్డప్ ఇస్తూ నిరుద్యోగులను వంచనకు గురి చేస్తోంది. ఇదంతా గమనిస్తోన్న యువత తీవ్ర స్థాయిలో రేవంత్ సర్కారుపై మండిపడుతున్నారు.
పోలీస్ శాఖలో మొత్తం 20వేల ఖాళీలు ఉన్నట్లుగా గత డీజీపీ శివధర్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు. ఫలితంగా నిరుద్యోగులు భారీ ఉద్యోగ నియామకాల కోసం ఎదురు చూస్తున్నారు. రెండున్నరేళ్లుగా ఒక్క నోటిఫికేషన్ వేయకుండా తాత్సారం చేస్తూ వస్తోన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం కంటి తుడుపు చర్యగా 7వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేసింది. పోలీస్, జైళ్ల శాఖ, అగ్నిమాపక శాఖల్లో ఖాళీల భర్తీకి వేర్వేరుగా ఉద్యోగ నియామక ప్రకటనలు ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 20వేల పోలీస్ ఉద్యోగాల భర్తీకి నిరుద్యోగ యువత రోడ్డు ఎక్కి ఆందోళనలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ మోసపూరిత హామీలు, ప్రకటనలపై కన్నెర్ర చేశారు. అయినప్పటికీ తూతూ మంత్రంగా ప్రకటనలతోనే ప్రభుత్వం సరిపెట్టింది. సివిల్, ఏఆర్, రిజర్వ్ విభాగాల్లో ఎస్సై, కానిస్టేబుల్ భర్తీ ప్రక్రియను చేపడుతున్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్, కామారెడ్డి జిల్లా పరిధితో పాటుగా ఎస్సై స్థాయి జోనల్ స్థాయి పోస్టులను విభజిస్తే మనకు దక్కుతున్న పోస్టుల సంఖ్య అత్యంత స్వల్పంగా ఉన్నాయి.
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో కేవలం 122, కామారెడ్డిలో 42(లోకల్ రిక్రూట్మెంట్లో 2 పోస్టులు కలుస్తున్నాయి) సివిల్ కానిస్టేబుల్ పోస్టులు ఖాళీ చూపించారు. ఏఆర్ కానిస్టేబుల్ పోస్టులు నిజామాబాద్ కమిషనరేట్‌కు 54, కామారెడ్డికి 24(లోకల్ రిక్రూట్మెంట్లో 1 పోస్టు కలుస్తోంది) మాత్రమే చూపించారు. ఎస్సై ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారిపై రేవంత్ ప్రభుత్వం నీళ్లు చల్లింది. సివిల్ ఎస్సై ఏఆర్ ఎస్సై, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ పోస్టులు బాసర జోన్లో 36, రాజన్న జోన్లో కేవలం 39 చూపించారు. టీజీఎస్పీ ఎస్సై బాసర జోన్లో 1, డిప్యూటీ జైలర్ 2 మాత్రమే వచ్చాయి. రాజన్న జోన్లో టీజీఎస్పీ ఎస్సై 2, డిప్యూటీ జైలర్ 2 పోస్టులు మాత్రమే ఉన్నాయి. మెకానిక్, డ్రైవర్లు, ఇతరత్రా ఉద్యోగాలు ఒకట్రెండు తప్పా ఉమ్మడి జిల్లాకు ఒనగూరిన లాభమే లేదు. ఉద్యోగ నియామకాల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేల మాటలకు వారి చేతలకు పొంతనే లేదనడానికి పోలీస్ రిక్రూట్మెంట్ ఉదాహారణగా నిలుస్తోంది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పూర్తి స్థాయిలో ఉద్యోగ నోటిఫికేషన్లు పత్తా లేకుండా పోయింది. కేసీఆర్ హయాంలో నోటిఫికేషన్లు జారీ చేసి, దరఖాస్తులు స్వీకరించి, పరీక్షలు నిర్వహించిన వాటికి కేవలం ఫలితాలు ప్రకటించి నియామక పత్రాలను ఈ ప్రభుత్వం ఇచ్చింది. బీఆర్ఎస్కు పేరు రావొద్దనే ఉద్దేశంతో నియామక పత్రాలను స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందించారు. ఎల్బీ స్టేడియంలో ప్రత్యేకంగా కార్యక్రమాలను వివిధ దఫాలుగా నిర్వహించి ఆర్భాటంగా ప్రకటనలు ఇచ్చారు. ఆ తర్వాత పదుల సంఖ్యలో పోస్టులతో నోటిఫికేషన్లు ఒకట్రెండు మాత్రమే వచ్చాయి. రెండేళ్లుగా ఒక్కటంటే ఒక్క ఉద్యోగానికి నోటిఫికేషన్ జారీ కాలేదు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 నియామకాలకు నోటిఫికేషన్ జారీ కాలేదు.
వీటికి సంబంధించిన నియామక ప్రక్రియ కేసీఆర్ పాలనలోనే 90శాతం పూర్తైంది. ఆ తర్వాత గ్రూప్స్ నోటిఫికేషన్లు విడుదల చేయకపోగా నిరుద్యోగులకు కపట ప్రకటనలతో నిత్యం తప్పుదారి పట్టించే విధంగా కాంగ్రెస్ సర్కారు కుటిల యత్నాలకు ప్రయత్నిస్తుండటం విడ్డూరంగా మారింది. రెండున్నరేళ్లు దాటుతున్నప్పటికీ రేవంత్ రెడ్డి మాటలు నెరవేరక పోవడంతో యువత ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పటికే ఆందోళన బాట పట్టి ఉద్యమాలు చేస్తుండటంతో పోలీసులను అడ్డం పెట్టి అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ తీరును ఎండగడుతూ నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఏడాదిలోనే 2లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి మాటలను గుర్తు చేస్తూ రోడ్డు ఎక్కుతున్నారు. ఇచ్చిన మాటను నెరవేర్చాలని కోరుతున్నారు.