బెంగళూరు: మూడు నెలల వయస్సున్న కవల కుమార్తెలను తల్లి హత్యచేసింది. ఆ తర్వాత ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించింది. అప్పుడే ఇంటికి చేరుకున్న భర్త ఆమె ప్రయత్నాన్ని అడ్డుకున్నాడు. ప్రసవానంతర కుంగుబాటు వల్ల ఆ మహిళ ఈ చర్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. (Woman Kills Twin Daughters) కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. వజ్రహళ్లి ప్రాంతంలో నివసిస్తున్న రామలింగప్ప భార్య ఉమాదేవి ఐవీఎఫ్ చికిత్స ద్వారా మే 5న కవల ఆడపిల్లలకు జన్మనిచ్చింది. అయితే మంగళవారం మధ్యాహ్నం ఇద్దరు కవల కుమార్తెలను ఆమె హత్య చేసింది. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకోబోతుండగా అప్పుడే ఇంటికి చేరుకున్న రామలింగప్ప భార్య ప్రయత్నాన్ని అడ్డుకున్నాడు. అదే గదిలో కవల ఆడపిల్లలు విగతజీవులై కనిపించడంతో అతడు షాక్ అయ్యాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా ఆ పసి పిల్లలు అప్పటికే మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. వారిని నీటిలో ముంచి చంపినట్లు అనుమానం వ్యక్తం చేశారు.
కాగా, ప్రసవం తర్వాత ఉమాదేవి ప్రవర్తనలో మార్పును కుటుంబ సభ్యులు గమనించారు. కవల ఆడపిల్లల పట్ల ఆమె ఆసక్తి చూపకపోగా, వారిని ఏదైనా ఆశ్రమానికి పంపాలంటూ పదేపదే చెప్పినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆమెకు మానసిక చికిత్స అందించినట్లు వారు చెప్పారు. ఉమాదేవి ప్రవర్తనకు ప్రసవానంతర కుంగుబాటు, హార్మోన్ల అసమతుల్యత కారణమని వైద్యులు నిర్ధారించారు. కవల ఆడపిల్లల హత్య విషయం తెలుసుకున్న పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.