Pawan Kalyan | ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అభిమానులు భారీగా వేడుకలకు సిద్ధమయ్యారు. తమ అభిమాన హీరో, నాయకుడి జన్మదినాన్ని ఘనంగా జరుపుకునేందుకు పలుచోట్ల భారీ ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేస్తూ సందడి చేస్తున్నారు. అయితే అమలాపురంలో జరిగిన ఓ విషాదకర ఘటన పవన్ అభిమానుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. పవన్ కళ్యాణ్ బర్త్‌డే వేడుకల కోసం ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై రోళ్ల ప్రేమ్ కుమార్ అనే అభిమాని ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
అమలాపురంలో తన అభిమాని, జనసైనికుడు రోళ్ల ప్రేమ్ కుమార్ మృతి చెందడం తనను తీవ్రంగా కలచివేసిందని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. “అమలాపురంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురైన ప్రేమ్ కుమార్ ప్రాణాలు కోల్పోవడం నన్ను ఎంతగానో కలచివేసింది. ప్రేమ్ కుమార్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ.. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రేమ్ కుమార్ కుటుంబానికి తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు. రోళ్ల ప్రేమ్ కుమార్ హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నట్లు సమాచారం. ఆయన స్వస్థలం అమలాపురం ప్రాంతంలోని బెండ ముర్లంక. పవన్ కళ్యాణ్‌పై ఉన్న అభిమానంతో ఆయన పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనేందుకు స్నేహితులతో కలిసి సొంతూరికి వచ్చారు.
బుధవారం అమలాపురంలోని ఓ కాలేజీ సమీపంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా బ్యానర్ ఏర్పాటు చేస్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. ఫ్లెక్సీ కడుతున్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లు తగలడంతో ప్రేమ్ కుమార్ తీవ్ర విద్యుత్ షాక్‌కు గురయ్యారు. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అభిమాన హీరో పుట్టినరోజును ఆనందంగా జరుపుకునేందుకు వచ్చిన ప్రేమ్ కుమార్ ఇలా ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు, స్థానిక అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ ఘటన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అభిమానులకు కీలక సూచనలు చేశారు. ఉత్సాహం, అత్యుత్సాహం కారణంగా ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టుకోవద్దని విజ్ఞప్తి చేశారు. జీవితం ఎంతో అమూల్యమైనది. పుట్టినరోజు వేడుకలు, ఉత్సవాల సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే సమయంలో మన కోసం ఒక కుటుంబం ఉందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి అని పవన్ కళ్యాణ్ సూచించారు.
ముఖ్యంగా ఎత్తైన ప్రదేశాల్లో ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేసే సమయంలో విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలని, భారీ ర్యాలీలు నిర్వహించేటప్పుడు కూడా స్వీయ భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కోరారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలకు సిద్ధమవుతున్న వేళ అమలాపురం ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అభిమానాన్ని చాటుకోవడం కోసం చేసే ఏ కార్యక్రమమైనా జాగ్రత్తగా, సురక్షితంగా నిర్వహించుకోవాలని ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది. అభిమానం ఎంత గొప్పదైనా.. ఒక కుటుంబానికి తమ వ్యక్తి ప్రాణం కంటే ఏదీ ఎక్కువ కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని పవన్ కళ్యాణ్ చేసిన సూచన ఇప్పుడు అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది.